Tuesday, November 26, 2024

కేంద్రంపై వార్.. ఇందిరా పార్క్ దగ్గర రేపు టీఆర్ ఎస్ ధర్నా..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: రేపు హైదరాబాద్‌ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డిసిసిబి ఛైర్మన్‌లు, రైతు సమన్వయసమితి అధ్యక్షులు అంతా కలిసి ఇందిరాపార్క్‌ వద్ద మహా ధర్నా చేస్తామని, రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. తర్వాత రెండురోజులు గడువిస్తామని, కేంద్రం స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ళపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు భవిష్యత్‌ కార్యాచరణ స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

యాసంగిలో వరి సాగు చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడంతో… ధాన్యం కొనుగోలు చేస్తారా..? లేదా..? అని రైతులు నిలదీస్తున్నారు. ఇక తప్పులో పడిపోయామని గ్రహించిన బండి సంజయ్‌ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి కొత్త రాజకీయ డ్రామా ఆడుతున్నాడు. అసలు కొనుగోలు కేంద్రాల దగ్గర నీకు ఏం పని..?, ఆడికి ఎందుకు పోయినవు..?, రైతులు నిలదీస్తే వారిని రాళ్లతో కొడుతున్నారు. కొందరు రైతులకు గాయాలు చేశారు. రైతుల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉండకూడదా..?. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు భూములు లేవా..?, వాళ్లు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు రావొెద్దా..?, టీఆర్‌ఎస్‌ పక్షాన కచ్చితంగా కార్యకర్తలు బీజేపీని నిలదీస్తారు.” అని సీఎం స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్న కేంద్రం మన దగ్గర ఎందుకు కొనుగోలు చేయదు అని అడిగితే ఇంత వరకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంలో తికమకను తేల్చుకునేందుకు ఇటీవల తాను స్వయంగా ఢిల్లి వెళ్లి ఇదే పనిపై కేంద్ర మంత్రిని కలిశానని గుర్తు చేశారు. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ (జీఓఎం) సమావేశంలో మాట్లాడి చెబుతామని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి హామీ ఇచ్చి… నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదని మండిపడ్డారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని రాసిస్తేనే ధాన్యం కొంటామని నిబంధన విధిస్తే విధిలేని పరిస్థితుల్లో అంగీకారం తెలిపినా కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాసంగిలో వరిసాగు చేయాలా వద్దా..?, అన్న విషయంలో బుధవారమే ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రికి లేఖ రాస్తానని సీఎం చెప్పారు. ఎందుకంటే ఈ నెలలోనే అనురాధ కార్తె ప్రవేశిస్తోంది. రైతులు వరినారు పోస్తారు. ఆ తర్వాత వద్దంటే రైతులు నష్టపోతారు..?, అని చెప్పారు .యాసంగిలో వరిసాగు పై రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే తాము కష్టపడి తెలంగాణ రైతులను ఒకదారికి తీసుకొచ్చాం, వరిసాగు ను స్థీరీకరించాం. రైతు బందు, రైతు భీమా ఇస్తున్నాం. నీటి తీరువా రద్దు చేసి, నీటి తీరువా లేకుండా సాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

విద్యుత్‌ చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభలోనే తీర్మాణం చేశామని సీఎం అన్నారు. రైతు చట్టాలను నల్ల చట్టాలుగా పేర్కొంటూ టీఆర్‌ఎస్‌ ధర్నాలు కూడా చేసిందని గుర్తు చేశారు. రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఫైట్‌ కొనసాగుతూనే ఉంటుందని, ఆగదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం విషయంలో తలాతోక లేని మాటలు చెప్పడం బీజేపీకి అలవాటు… టీఆర్‌ఎస్‌ చెప్పినవన్నీ రైతులకు చేసి చూపించామన్నారు. రైతు బంధు, రైతు భీమా, నీటి తీరువా రద్దు, ధాన్యం కొంటాం అని అన్నీ చేసి చూపించామని… అయితే కేంద్రం తొండి చేస్తుండడంతో సమస్య వచ్చిందని, సమస్యను సృష్టిస్తామంటే తెలంగాణలో సాధ్యం కాదని, తెలంగాణ ఉద్యమకారుల గడ్డ అని, చివరి ఫలితం వచ్చేదాకా పోరాడుతుందని , కొట్లాడుతుందని విస్పష్టమైన ప్రకటన చేశారు

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement