తిరుపతి : జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి, 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు, సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీకి సహకరించాలని కోరారు. పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు.
కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని, తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపిల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..