అగ్ని పర్వతమంటేనే భయంతో హడలిపోతాం.. అటువంటిది అతిపెద్ద అగ్ని పర్వతం అంటే అమ్మో అది బద్దలయితే ఇంకేమైనా ఉందా.. కానీ అదే జరిగింది. ఇండోనేషియా జావా దీవిలో అతిపెద్ద అగ్నిపర్వతం అయిన మౌంట్ సెమెరు బద్దలయింది. దాంతో లావా ఏరులై పారింది. సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశించి బీభీత్సం సృష్టించింది. గ్రామస్తులు వెంటనే పిల్లలను, మేకలను మోసుకుంటూ ఊరు విడిచి దూరంగా పరుగులు తీశారు. ఆకాశంలోకి సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగజిమ్మింది. సమీప గ్రామాల్లోని నివాసాలు, ఇతరత్రాలు అన్నీ లావా, బూడిదలో కప్పుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 13 మంది మరణించినట్టు విపత్తు సహాయక అధికారులు ఆదివారం వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆకాశంలో బూడిద పూర్తిగా కమ్మేసింది. అక్కడ సూర్యుడు కనిపించకుండా మారిపోయింది. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలోనే పూర్తిగా చీకట్లు కమ్మేశాయి. అగ్నిపర్వతం బద్ధలవ్వగానే వేలాది మంది గ్రామస్తులు దూరంగా పరుగులు పెట్టారు. చాలా మందికి తాత్కాలిక శిబిరాల్లో ఆవాసం కల్పిస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలోని 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నింటినీ బూడిద కప్పేసింది. పశువులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సుమారు తొమ్మిది వందల మంది మసీదులు, స్కూళ్లు, కమ్యూనిటీ హాల్స్‌లో తలదాచుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ అగ్నిపర్వత ప్రభావం ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే అగ్నిపర్వతం సమీప గ్రామాల్లో మృతుల సంఖ్య 13కు పెరిగినట్టు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్ ముహారి వెల్లడించారు. కనీసం 57 మంది గాయపడ్డట్టు తెలిపారు. ఇందులో 41 మందికి కాలిన గాయాలు అయ్యాయని వివరించారు. వారిని హాస్పిటల్లో చేర్చినట్టు చెప్పారు. లుమాజాంగ్ చుట్టుపక్కల గ్రామాల్లో చిక్కుకున్న సుమారు 10 మందిని కాపాడినట్టు పేర్కొన్నారు. ఆదివారం ఈ సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వర్షాలు కురిస్తే ఇప్పటికే జావాలో ఆకాశమంతా వ్యాపించిన బూడిద మేఘాలు నేలపై కురిసే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అది లావా రూపంలోనూ ఆ ప్రాంతంలో నదిలా ప్రవహించే ముప్పూ లేకపోలేదని ఆ దేశానికి చెందిన టాప్ వల్కనాలజిస్ట్ సురోనో వివరించారు.