విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమానికి నేటితో వంద రోజులు పూర్తి అయ్యింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు దీక్షలు చేస్తున్నారు. ఉక్కు పోరాటానికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూర్మన్నపాలెం గెట్ వద్ద ఇవాళ కార్మికుల వినూత్న నిరసన చేస్తున్నారు. వంద అడుగుల బ్యానర్, వంద జెండాలతో కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.
కాగా, నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేయాలనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎంతో మందికి ఊపిరి అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మందికి ప్రాణ దానం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే సరఫరా చేస్తున్నారు. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది.
కోవిడ్ -19 బాధితుల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ చాలా కీలకంగా మారింది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గతేడాది కూడా స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.