Wednesday, November 20, 2024

Vision of KCR – తెలంగాణ వ‌స్తే ఆర్థికం అద్భుతమైంది..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రం వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఒక నమూనా…ఒక సమాధానం. ఒక రాష్ట్రం ఆవిర్భవిస్తే ఎంత శరవేగంగా గత నిర్లక్ష్యాలను రూపుమాపుకోవచ్చో…అందుకు నిదర్శనమే తెలంగాణ. ఆర్ధికంనుంచి అనిశ్చితుల వరకు…నీటిపారుదల నుంచి పాలనా వ్యవస్థల వరకు…కార్యాలయాలనుంచి కొత్త పంచాయతీల వరకు …ఇలా ఒకటేమిటి అన్ని రంగాల నమూనాగా…రోల్‌ మోడల్‌గా తెలంగాణ అద్భుతంగా వికసించింది. ఈ వికాసం వెనుక పదేళ్ల శ్రమ, అవినీతిరహిత, పక్షపాతంలేని అత్యద్భుత పాలన దాగున్నది.

ఈ పదేళ్లలో తెలంగాణ కేంద్రంనుంచి, వేరుపడిన ఏపీనుంచి ఎన్నో ఆటుపోట్లను, ఆంక్షలను, సహాయ నిరాకరణలను ఎదుర్కొన్నది. అయినా అభివృద్ధి పథాన్ని వీడలేదు. ముందుకు సాగాలన్న దీక్షను సడలించుకోలేదు. ఫలితంగా పదేళ్ల తెలంగాణ నాడు ఎట్లుండే…నేడు ఎట్లున్నది అన్నట్లుగా సజీవ సాక్ష్యంతో ముర్దుకు దూసుకెళుతున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్ధిక ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ నేర్పుగా నెట్టుకొచ్చింది.

కేంద్ర పాపం….
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా అనేక నాన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. తెలంగాణా ఇటువంటి ఆటుపోట్లు, ఆంక్షలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆర్ధిక క్రమశిక్షణతో ముందడుగేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులను తెలంగాణ దిగమింగుకున్నది.

- Advertisement -

నానాటికీ తగ్గుతున్న కేంద్ర వితరణ…
గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 84 కోట్ల నిధులను వివిధ క్యాపిటల్‌, ఇతర ఎక్స్‌పెండిచర్‌ చేయగా, సీఎస్‌ఎస్‌ పథకాల కింద కేంద్రంనుంచి అందింది రూ.5200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ. 1 లక్షా 84వేల కోట్లకు పెరిగి ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్ధిక పురోగతిలో దూసుకుపోతున్నది.

కొత్త లబ్దిదారులతో మరింత భారం…
రైతు రుణమాఫీ, రైతుబంధులలో కొత్త లబ్దిదారులతోపాటు కొత్తగా సామాజిక పించన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడనుంది. ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయకుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్ధిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చెెసింది.

ముందు చూపుతో…
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్యక్రమాలు, చర్యలతో గడచిన తొమ్మిదేళ్లుగా ఆర్ధిక సుస్థితరను కొనసాగించుకుంటూ ముందుకు సాగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేతనాలతో సతమతమవుతూనే అంతే గొప్పగా ఆర్ధిక స్థిరత్వానికి ముందుచూపుతో కీలక చర్యలు తీసుకుంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement