Tuesday, November 26, 2024

‘మా’లో ఎన్నికల వేడి.. మంచు విష్ణు లక్ష్యంగా ఏంటి?

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు వేడి పెంచుతున్నాయి. ‘మా’ అధ్యక్ష ప‌దవి కోసం  హీరో మంచు విష్ణుతో పాటు సినీ నటులు ప్రకాశ్ రాజ్‌, జీవితా రాజశేఖర్‌, హేమ కూడా పోటీలో ఉండడంతో ఈ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాష్‌ రాజ్ పోటీపై లోకల్, నాన్ లోకల్ అనే వివాదం కూడా నడించింది. దీనిపై ఆయన తీవ్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో సీనియర్ నటుడు, నిర్మాత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిన్న మా అధ్య‌క్షుడు న‌రేశ్ కూడా మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. తాజాగా మా అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల్లో పోటీపై మంచు విష్ణు ఆదివారం లేఖ విడుదల చేశారు. తాను మా అధ్యక్షుడిగా ఎందుకు పోటీ చేస్తున్నది అందులో వివరించారు.

‘మా’ అధ్య‌క్ష ప‌ద‌వికి తాను నామినేష‌న్ వేస్తున్నాన‌ని మంచు విష్ణు తెలిపారు. తాను సినీ ప‌రిశ్ర‌మ న‌మ్మిన కుటుంబంలో పుట్టాన‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లు, క‌ష్ట‌న‌ష్టాల గురించి త‌న‌కు తెలుస‌ని తెలిపారు. త‌న‌కు, త‌న కుటుంబానికి ఎంతో పేరు, ప్రతిష్ఠ‌లు అందించిన తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు రుణ‌ప‌డి ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఆ రుణం తీర్చుకోవ‌డానికి ఈ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేయ‌డం త‌న క‌ర్త‌వ్యంగా భావిస్తున్నాన‌ని తెలిపారు.

తన తండ్రి మోహన్ బాబు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు తనకు మార్గదర్శకాలు అయ్యాయని చెప్పారు. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిండెంట్‌గా తాను పని చేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్‌కి తన కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా తాను కొన్ని సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశానని చెప్పారు. ‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటిని అతిదగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన తనకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన అనుభవం ఉందన్నారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని అన్నారు. ‘మా’ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానని విష్ణు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement