నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేయాలనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎంతో మందికి ఊపిరి అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మందికి ప్రాణ దానం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే సరఫరా చేస్తున్నారు. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది.
కోవిడ్ -19 బాధితుల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ చాలా కీలకంగా మారింది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గతేడాది కూడా స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
ఉక్కు, ఇనుము, మందుల తయారీ కంపెనీలలో ఈ ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమలు తమ సొంతంగా యూనిట్లు పెట్టుకుని అవసరమైన ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ను తయారు చేసుకుంటాయి. స్టీల్ ప్లాంట్ లో కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్ లో కొంత భాగాన్ని ఇతర అవరాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తారు. దీనినే వైద్య పరిభాషలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అంటారు. అంటే సాధారణ ఆక్సిజన్ లో ఉంచే చిన్నచిన్న మలినాలను తీసి ప్యూరిఫై చేసి మెడికల్ లక్విడ్ ఆక్సిజన్ ను రూపొందిస్తారు.
స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ఏడాదికి లక్ష టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్‌లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకి 100 టన్నుల నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. దీని సామర్ద్యం ఎక్కువగా ఉన్నప్పటీకి… అవసరాల మేరకే ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో కొంత భాగాన్ని మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తున్నారు. అది ప్లాంట్‌లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయడానికి దీన్ని ఎక్కువ తయారు చేయాల్సి వస్తోంది.
కరోనా విస్తరణ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్, టాటా స్టీల్, జేఎస్పీఎల్, జేఎస్ డబ్యూ స్టీల్ లాంటి ఉక్కు కర్మాగారాలతోపాటూ మిగతా ఆక్సిజన్ తయారీ యూనిట్లు కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాయి. గతేడాది కూడా ఆక్సిజన్‌ను విజయవంతంగా ఆసుపత్రులకు సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు ఉత్పత్తిని రెట్టింపు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫారా చేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్, నష్టాల్లో ఉందనే సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఇఫ్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ అందరి ప్రాణాలు కాపాడుతోంది. దేశంలో తక్కువ ధరకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది విశాఖ స్టీల్‌ప్లాంట్ మాత్రమేనని కార్మిక సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లే ఇదంతా సాధ్యపడుతున్నట్లు వెల్లడించాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ లో హెల్త్ ఆక్సిజన్ ఇబ్బంది పడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఇలా ఉపయోగపడడం.. ప్రాణవాయువుకోసం ప్లాంట్ మీద ఆధారపడడం గర్వంగా ఉందని కార్మికసంఘాలు అంటున్నాయి. ఈ పనిని నిబద్ధతతో పూర్తి చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నామని, దేశానికి కావాల్సిన ఆక్సీజన్ అందించడం మా బాధ్యత అంటున్నారు. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.