విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు .. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానుంది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు, కార్మికులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాగా నేటితో స్టీల్ ప్లాంట్ కార్మికపోరాటం మూడు వందల రోజులకి చేరుకుంది.దాంతో కార్మికులు ఈ ఉద్యమాన్ని మరింతగా ఉథృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా గత జనవరి 27నుండి కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడంపై ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని స్టీల్ ప్లాంట్ కార్మికులు సమావేశాలు చేపడుతున్నారు. 300 రోజులకు ఉద్యమం చేరిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని కార్మికులు హెచ్చరించారు.
ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే అక్కడికి పలు సంఘాల నాయకులతో పాటు కార్మికులు చేరుకుంటున్నారు. గాజువాక వద్ద భారీ ధర్నా నిర్వహించి స్టీల్ ప్లాంట్ కోసం తమ డిమాండ్లను కేంద్రానికి వినిపిస్తామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దీని కోసం రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి.
ఇక ప్రతిపక్ష పార్టీ టిడిపి కూడా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. జనసేన పార్టీ కూడా ఈ ఉద్యమానికి సై అంది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించడంతో పాటు వారి వద్దకు వెళ్లి సంఘీభావం సైతం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించ వద్దని కేంద్రాన్ని కోరారు. జగన్ ప్రభుత్వం సైతం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నిర్ణయం మార్చుకోవాలని లేఖలో కోరింది. రాష్ట్రమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ముందుకు నడుస్తుంటే కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ నిర్ణయంలో మార్పు లేదంటూ స్పష్టం చేసింది. మరి ఈ ఉద్యమం మరింత ఊపునందుకోనుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరి కేంద్రం ఏమంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital