పశ్చిమ బంగాల్లో నాలుగో విడత పోలింగ్ జరగుతున్న వేళ కూచ్‌బెహార్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీతల్‌కుచి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో నాలుగో దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. తొలి మూడు దశల్లో 91 స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. నాలుగో దశలో ఐదు జిల్లాల్లోని 44 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. టీఎంసీ బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నాలుగో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో దిగారు. ఇందులో కేంద్రమంత్రి, బాలీవుడ్ సింగర్ బాబుల్ సుప్రియో, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, లాకెట్ ఛటర్జీ, పాయల్ సర్కార్, మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ఉన్నారు.
నాలుగో విడత పోలింగ్ జరగుతున్న వేళ కూచ్ బెహార్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సీతాల్ కుచ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఘర్షణలు తలెత్తాయి. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. బలగాల కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హమిదుల్ హక్, మోనిరుల్ హక్, సామ్యిల్ మియా, అమ్జాద్ హొస్సేన్లుగా గుర్తించారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులుగా తెలుస్తోంది. కేంద్ర దళాలు వారి పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నార బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం ప్రజలకు అన్యాయం చేస్తోందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
మరోవైపు కూచ్‌బెహర్‌లో కాల్పుల ఘటనలో ఐదుగురు మృతిచెందడంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిలిగురిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. కూచ్‌బెహర్ ఘటనను ప్రస్తావించారు. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మృతిచెందడం కలచివేసిందన్నారు. వారి మృతికి సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీజేపీకి పెరుగుతున్న మద్దతును చూసి తట్టుకోలేక దీదీ, ఆమె గూండాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు.