హైదరాబాద్, ఆంధ్రప్రభ: చదువులో వెనుకబడిన విద్యార్థులను స్థానిక గ్రామ సర్పంచ్‌లు, ఎంపిటీసీలతో ప్రత్యేకంగా గుర్తించి ఆ గ్రామంలోనే చదువుకున్న యువకులను వలంటీర్లుగా నియమించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎన్‌జీవోల సహకారంతో ఆయా గ్రామాల్లోని చదువుకున్న యువతను వలంటీర్లుగా నియమించి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తూ చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో జరిగిన చదువులో వెనుకబడ్డ వారికి ఎన్‌జీవోల సహకారం, స్థానికంగా చదువుకున్న యువత సహకారంతో చేపట్టనున్న కార్యక్రమంపై బుధవారం మంత్రి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తూ చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. అయితే కరోనా సమయంలో విద్యకు దూరమైన పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా నూతన బోధన పద్ధతులతో ఇప్పటికే తొలిమెట్టును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ప్రత్యేకంగా గుర్తించి, ఎన్‌జీవోల సహకారంతో తీసుకొని గ్రామంలోని చదువుకున్న యువతను వాలంటీర్లుగా నియమించి తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తొలిమెట్టును రాష్ట్రంలో మోడల్‌గా మహేశ్వరంలో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. మొదటి విడత మన ఊరు-మన బడి పాఠశాలల పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయన్నారు. ఇంకేమన్నమిగిలి ఉంటే పాఠశాలల్లో మౌలిక వసతులు స్థానిక నేతలతో ఏర్పాటు చేసి బడులు పున:ప్రారంభమయ్యే సరికి పూర్తి చేయాలని సూచించారు.