1888లో ప్రారంభమై సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. రీ డెవలప్‌మెంట్ పేరు చెప్పి 99 ఏళ్లు పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ప్రాధాన్యం కల్గిన ఈ స్టేషన్‌ను లీజుకు ఇవ్వనుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కమర్షియల్‌గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని గతంలోనే రైల్వే బోర్డు నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కూడా కోరింది. అప్పట్లో బిడ్డర్లు ముందుకు వచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. అప్పట్లో 30 ఏళ్లు లీజు కాలంగా ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషన్‌ను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేశారు. అందులో విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చారు.
కరోనాకు ముందు ప్రతిరోజు విజయవాడ మీదుగా 250పైగా రైళ్లు రాకపోకలు సాగించేవి. అయితే విజయవాడ డివిజన్ నుంచి రైల్వేకు భారీగా ఆదాయం లభిస్తున్నా 99 ఏళ్ల పాటు రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్ ప్రైవేట్ పరం అయితే ప్రయాణికులపై ఛార్జీల భారం అధికంగా ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖనే కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.