Friday, November 22, 2024

ఉద్యోగుల ఉసురు తీస్తోన్న జీవో నెం.317 – విజ‌య‌శాంతి

జీవో నెం.317పై బిజెపి మ‌హిళా నేత విజ‌య‌శాంతి స్పందించారు. ఉద్యోగుల ఉసురు తీస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. భ‌ర్త‌ను ఓ జిల్లాకి, భార్య‌ని మ‌రో జిల్లాకి బ‌దిలీ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఆప్ష‌న్ ప్ర‌కారం బ‌దిలీ చేయాల‌ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళ‌న చెందుతున్నార‌ని విజ‌య‌శాంతి చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో నెం.317కి చిక్కుకుని విల విల్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు అంతమొందించడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.

బదిలీల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆప్షన్లు, ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీలు చేపడుతోందని ఆరోపించారు. ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడమే కాకుండా, భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై ఏంచేయాలో తెలియని ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రగతిభవన్ ను ముట్టడిస్తే, పోలీసులు లాఠీలకు పనిచెబుతూ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత తీరుతో ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయశాంతి చెప్పారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ లో మార్పులేదని, ప్రాణాలు పోతే పోనీ బదిలీలు మాత్రం ఆగరాదంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అష్టకష్టాల పాల్జేస్తూ వారి ఉసురు తీస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement