Monday, November 25, 2024

AP: అనామకురాలిపై లేడీ పోలీస్ ​ఆఫీసర్​ దాడి.. కాలితో తన్నుతూ పోలీస్​ వాహనంలోకి.. (వీడియో)

శ్రీకాళహస్తి వన్​ -టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజుయాదవ్ ఒక మహిళపై దాడి చేసిన వీడియో శనివారం వైరల్‌గా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందిన సమాచారం మేరకు.. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీఐ తన సిబ్బందితో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలోని రాంనగర్ కాలనీకి వెళ్లారు. నిందితుడి తన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య ధనలక్ష్మిని సీఐ ప్రశ్నించారు. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని బెదిరిస్తూ ఆమెపై కాలితో తన్నుతూ దాడికి దిగారు.

ఇక.. వైరల్​ అవుతున్న వీడియోలో లేడీ ఇన్‌స్పెక్టర్ అంజుయాదవ్​ బాధిత మహిళ ధనలక్ష్మిని దూషిస్తూ, పోలీసు వాహనంలోకి బలవంతంగా ఎక్కించడాన్ని చూడొచ్చు. ఈ క్రమంలో మహిళను లోపలికి నెడుతూ దాడిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ఆసుపత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఇంతకుముందు కూడా ఇన్‌స్పెక్టర్‌ తనను తన్నారని బాధిత మహిళ ఆరోపించింది. తనకు ఈ మధ్య పెద్దాపరేషన్​ అయ్యిందని చెబుతున్నా వినకుండా సీఐ కాలితో తన్నిందని తెలిపింది. ఇక.. సీఐ కాలితో తన్నడంతో ఆ మహిళకు తీవ్రంగా బ్లీడింగ్​ అయ్యింది. దీంతో లోకల్​గా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో తిరుపతిలోని ఎస్​వీఆర్​ఆర్​ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోండి.. -టీడీపీ మహిళా నేత ఉష

- Advertisement -

శ్రీకాళహస్తిలో ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగించే ధనలక్ష్మి అనే మహిళపై అమానుషంగా ప్రవర్తించిన 1వ పట్టణ సీఐ అంజూయాదవ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఐ అంజూయాదవ్ మానవత్వం మరచి పోలీసు అధికారి అనే అహంకారంతో నడిరోడ్డుపై మహిళను చితకబాదడం సభ్య సమాజానికే సిగ్గు చేటన్నారు. మహిళా అధికారి అయి ఉండి కూడా ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మేడం అనలేదనే ఒకే ఒక కారణంతో అంజూయాదవ్ ఇలా క్రౌర్యంగా ప్రవర్తించారని ఉష ఆరోపించారు.

తాను ఇటీవలనే పెద్ద ఆపరేషన్ చేసుకున్నానని… తనను కొట్టవద్దని ధనలక్ష్మి వేడుకున్నా అంజూయాదవ్ కరుణించలేదన్నారు. ధనలక్ష్మిని రాత్రి 10గంటల తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బూట్ల కాళ్లతో తన్నడంతో పాటు చిత్ర హింసలకు గురి చేశారన్నారు. సామాన్య మహిళపట్ల ఇలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని చక్రాల ఉష ప్రశ్నించారు. ధనలక్ష్మి చేసిన తప్పేంటో పోలీసులు చెప్పాలని ఆమె డిమాండు చేశారు. సమయం మించి హోటల్ నిర్వహిస్తుంటే మూసేయాలని చెప్పాలే తప్ప ఇలా మానవత్వం మరచి దారుణంగా కొట్టడం మంచిదికాదన్నారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చే వారి పట్ల కూడా అంజూయాదవ్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారని చక్రాల ఉష ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement