కర్నాటకలోని తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌లో ఓ సేల్స్ మెన్ రైతును అవమానించిన వీడియో వైరల్‌గా మారింది. కెంపెగౌడ ఓ మామూలు రైతు. తన స్నేహితులతో కలిసి కారు కొనడానికి సిటీకి వచ్చాడు. కారు వివరాలు తెలుసుకోవడానికి ఓ మహీంద్రా షోరూమ్ కు వెళ్లగా.. షోరూమ్‌లో ఉన్న సేల్స్ మెన్ రైతును అనరాని మాటలు అని అవమానించాడు. అంతేకాకుండా ‘‘ఇతని జేబులో రూ.10 కూడా ఉండదు.. కానీ, రూ.10 లక్షలు పెట్టి కారు కొంటాడట’’ అని అవమానించాడు. దీంతో ఆ రైతు దాన్ని సవాల్ గా తీసుకున్నాడు.
అయితే.. ‘‘రూ.10 లక్షలు తీసుకువస్తే వెంటనే కారు డెలివరీ చేస్తావా’’ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ను సవాలు చేస్తూ రైతు షోరూం నుంచి వెళ్లిపోయాడు. 30 నిమిషాల తర్వాత రైతు రూ.10 లక్షలతో తిరిగి వచ్చి కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ చేయలేక రెండు రోజులు టైమ్ కావాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన రైతు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.