Friday, November 22, 2024

ట్రెండింగ్ లో వీడియో డేటింగ్.. సర్వేలో మ‌నోళ్లే టాప్..

హైదరాబాద్‌ అంటే ఘుమఘుమలాడే బిర్యానీ.. హైదరాబాద్‌ అంటే నవాబుల నిర్మాణాలు.. హైదరాబాద్‌ అంటే ఐటీ టవర్లు.. హైదరాబాద్‌ అంటే ఫార్మా సిటీ..హైదరాబాద్‌ అంటే అవకాశాల గని.. అన్నీ ఉన్న రాజధానిలో ఇప్పుడు హైదరబాదీలు వీడియో డేటింగ్‌లోనూ ముందున్నారని తేలింది. ఆన్‌లైన్‌ డేటింగ్‌ ప్లాట్‌ఫాం టిండర్‌ నిర్వహించిన ”ఇయర్‌ ఇన్‌ స్వైప్‌-2021” సర్వేలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ విచిత్రమేమిటంటే హైదరాబాద్‌ కంటే సాప్ట్ వేర్‌లో ముందున్న చెన్నై, బెంగళూరు, పుణె నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీడియో డేటింగ్‌లో మొదటి స్థానంలో హైదరాబాద్‌ నిలువగా, రెండవ స్థానంలో చెన్నై, మూడవ స్థానంలో బెంగళూరు, నాలుగవ స్థానంలో అహ్మదాబాద్, ఐదవ స్థానంలో పుణ నగరాలున్నాయి. మరి కొద్ది రోజుల్లో 2021 ఏడాది ముగియనున్నందున.. ఈ ఏడాదిలో వీడియా డేటింగ్‌పై అంచనాకు వచ్చేందుకు ఈ సర్వేను టిండర్‌ చేపట్టింది

ఈ సర్వేలో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వారి నుంచి సమాచారం సేకరించింది. రోజురోజుకూ వీడియో డేటింగ్స్‌ వేగంగా పెరుగుతున్నాయని సర్వే చేసిన టిండర్‌ నివేదికలో పేర్కొంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్‌ అనేది ఒక ఫ్యాషన్‌గా మారిన నేపథ్యంలో టిండర్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. టిండర్‌ సహా ఇతర డేటింగ్‌ యాప్‌లలోని రకరకాల అంశాలపై యూజర్లను ప్రశ్నలడిగారు. ఇందులో ప్రధానంగా పిక్నిక్‌ ఇన్‌ ఎ పార్క్‌, వర్చువల్‌ మూవీ, నైట్‌ సైక్లింగ్‌, పొట్టెరీ గెట్టింగ్‌ కాఫీ, వార్మ్‌ హగ్‌ వంటివి ఉన్నాయి. కరోనాతో యాప్‌లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది.

ప్రజలు డైరెక్ట్‌గా కన్నా వర్చువల్‌గానే ఇతరులతో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. మరోవైపు ఎమోజీల ద్వారా భావోద్వేగాలు పంచుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌హోం, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు చాలా దగ్గరయ్యాయి. వీటితో పాటు ఫుడ్‌, న్యూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే వెతుక్కుంటున్నారు. దీంతో సెల్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు చిన్నా, చితక ఉద్యోగాలు చేసే వారు కూడా ఫోన్‌ల ద్వారానే తమ కార్యకలాపాలను ఎక్కువగా పూర్తి చేస్తున్నారు.

ఇదే సమయంలో వీడియో డేటింగ్‌ యాప్‌లకు విపరీతమైన క్రెజ్ ఏర్పడింది. కొన్నేళ్ళ క్రితం వరకు ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండేది, కానీ ఈ మధ్య మనదేశంలోనూ పాశ్చాత్య సంస్కృతి పెరగడంతో పాటు బార్లు, క్లబ్‌లు, పబ్‌లు కూడా విపరీతంగా పెరిగాయి. టిండర్‌ యాప్‌ వీడియో కాల్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో గణనీయమైన వృద్ధిని సాధించామని, అతికొద్ది రోజుల్లోనే ఏకంగా 52 శాతం వృద్ధి నమోదైందని సర్వేలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement