కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి రాష్ట్రంలో తమ పార్టీ అధికార పగ్గాలు చేపడతుందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కాషాయ పార్టీపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పేదరికం వంటి ప్రధాన సమస్యల నుంచి బీజేపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. కర్నాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ తీరును దుయ్యబట్టారు.బీజేపీ ప్రభుత్వం తమను లూటీ చేసిందని గుర్తెరిగిన ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుతున్నారని అన్నారు. బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని కర్నాటక ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కర్నాటకలో పాలక బీజేపీకి భంగపాటు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన బీజేపీ సర్కార్‌ను మట్టికరిపించి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోరాడుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement