ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. పరాష్ట్రపతికి టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తరువాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఉపరాష్ట్రపతికి చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని అందజేశారు. ఇటీవల డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ల్యామినేటెడ్ ఫోటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, ఆరు షీట్ల క్యాలెండర్ ఈవో అందజేస్తూ, వాటి తయారీ, ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించిన్నట్లు తెలిపారు. టిటిడి అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు వెళుతున్నందుకు ఆయన ప్రశంసించారు. గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తన మనుమరాలు సుష్మకు ఆనందకరమైన వైవాహిక జీవితాన్నిఅనుగ్రహించాలని శ్రీవారిని కోరినట్లు ఆయన తెలిపారు. చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.