Saturday, November 23, 2024

Telangana: మూడు రోజులపాటు వైభవ వజ్రోత్సవం.. భారత్‌లో తెలంగాణ కలిసిన ఘట్టానికి ఘన వేడుకలు

తెలంగాణ‌లో మూడు రోజుల‌పాటు వైభ‌వ వజ్రోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఇవ్వాల (శ‌నివారం) కేబినెట్ క‌మిటీ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భార‌త్‌లో తెలంగాణ క‌లిసిన ఘ‌ట్టానికి సూచ‌న‌గా ఘ‌నంగా వేడుక‌లు జ‌రిపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా మార్గంలో బ్రిటిష్‌ వలసాధిపత్యాన్నిబద్దలు కొట్టి.. స్వాతంత్య్రాన్ని సముపార్జించుకున్న భారతావనిలో తెలంగాణ అంతర్భాగమై 74 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో తెలంగాణ అనేకానేక మలుపులు తిరిగింది.

ఆస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే దశకు చేరుకున్నది. తెలంగాణ సంస్కృతి పరాధీనమైంది. కడగండ్లకు లోనయింది. అయినప్పటికీ స్వతంత్ర భారత పోరాట స్ఫూర్తితో, మహనీయుడు గాంధీ చూపిన అహింసా మార్గంలోనే ఉద్యమాన్ని కొనసాగించి, స్వయం పాలనను సాధించుకున్నది. ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం మరొకటి లేదని చాటిచెప్పింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉజ్వల పోరాటంతో విశాల దేశంగా ఆవిర్భవించిన ప్రజాస్వామ్య భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కావడం ఓ అపూర్వ ఘట్టం.

అహింసాయుత స్వతంత్ర పోరాటంతో భారత్‌ ప్రపంచానికి దారి చూపితే, అహింసాయుత అస్తిత్వ పోరాటంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు దారి చూపిన ఘనత తెలంగాణది. పరిపాలనలో అభివృద్ధితో 8 ఏండ్లలోనే అనితర సాధ్యమైన ప్రగతి సాధించి నేడు యావత్‌ దేశానికి దిక్సూచిగా నిలుస్తుండటం గర్వకారణం. ఆ విలువలను భవిష్యత్‌ తరానికి పరిచయం చేయాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. సైద్ధాంతిక భావజాలాలకు, జాతి, కుల, మతాలకు అతీతంగా అనేకమంది చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో భాగమైందని, ఈ చారిత్రక సత్యాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నది.

ఇటీవల స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ రాజ్యం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని సమాలోచనలు చేస్తున్నది. ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటేలా సంబురాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వీరుల త్యాగాలను స్మరిస్తూ, జాతీయ స్ఫూర్తిని, సమైక్యతా భావాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యంగా, తెలంగాణ ఖ్యాతిని ఎలుగెత్తి చాటడమే ధ్యేయంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నది. తెలంగాణ నేల సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారాలకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement