దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను వదిలేయడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజీవ్‌ను హత్య చేసిన వారి పట్ల సానుభూతి అక్కర్లేదన్నారు. ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దీనిపై తనకు చాలా బాధ కలిగిందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు.. రాజకీయాలు వేరని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు ఈ రోజు (ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు. వారిని విడిచిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు.
1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్తోపాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కానీ, తమిళనాడు ప్రభుత్వం మాత్రం దీన్ని స్వాగతించింది. వీరిపై తమిళుల్లో సానుభూతి, సానుకూలత ఉన్నది. ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏడుగురిని భాగం చేశారని, అసలు అది ఎంత పెద్ద నేరమో వారికి తెలియదని, వారికి కేటాయించిన పనులు మాత్రమే వారు చేసి పెట్టారని తమిళులు భావిస్తున్నారు.
ఈ కేసులో దోషుల సత్ప్రవర్తనను ఆధారం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మధ్యనే (మే నెలలో) ఈ కేసులో నిందుతుడు ఏజీ పెరారివాలన్ విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఏజీ పెరారివాలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం అనుభవించాడని, అందులోనూ 29 ఏళ్లు ఏకాంత కారాగార వాసాన్ని అనుభవించాడని తెలిపింది. ఆయన 19 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లాడు.
ఇక.. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే నెలలో రాజీవ్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) అనే శ్రీలంకన్ గ్రూప్ హతమార్చింది. ఈ ఆత్మాహుతి దాడిని ఎల్టీటీఈ ప్రతీకార దాడిగా చెబుతారు. 1987లో శ్రీలంకకు ఎల్టీటీఈని అణచివేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇండియన్ పీస్ కీపర్స్‌ను పంపించింది.
ఈ యుద్దంలో 1200 మంది మరణించిన తర్వాత వారిని తిరిగి వెనక్కి రప్పించింది భారత ప్రభుత్వం. శ్రీలంకలో మానవ హక్కులను దారుణంగా హననం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ పీస్ కీపర్లను అప్పటి భారత కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించుకుంది. దానికి కారకుడిగా పేర్కొంటూ ఎల్టీటీఈ తీవ్రవాదులు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబు పేల్చి హతమార్చారు.