మన దేశంలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో అతి ముఖ్యమైన తంతుగా భావించే పెళ్లిలో ఎంత డబ్బులు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. తరతరాలు గుర్తుంచుకోవాలని రకరకాలు రుచులతో విందు భోజనాలు పెడతారు. అయితే, పెళ్లి ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు తడిసిమోపెడవుతోంది. వరుడి తల్లిదండ్రులు పెళ్లిలో పది రకాల వంటకాలతో అదిరిపోయే విందు ఏర్పాట్లు చేయాలనే డిమాండు అమ్మాయి తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారుతోంది. కట్నకానుకలు సమర్పించుకోవడంతోపాటు విందు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఈ భారం నుంచి గట్టెక్కించేందుకు ఆ గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. తమ ఊళ్లో జరిగే పెళ్లిళ్లలో కేవలం ఒకే ఒక్క వంటకంతోనే విందు ఉండేలా తీర్మానించారు. ఎవ్వరూ తమ కుమార్తెల వివాహ విందులో మటన్, చికెన్, ఒక స్వీటు తప్ప.. ఇతర వంటకాలేవీ వడ్డించవద్దని ముస్లిమ్ సంఘాల పెద్దలంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.
వేములవాడ ముస్లిములు తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో అందరూ అభినందిస్తున్నారు. పెళ్లిళ్లలో పేద, ధనిక అనే తాహతు చూడకుండా మగ పెళ్లివారు విందు గొప్పగా జరగాలనే డిమాండు పెడుతున్నారు. పెళ్లికొడుకు తమ స్టేటస్ చూపించుకునేందుకు పెడుతున్న ఈ డిమాండుతో ఆడ పిల్లల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇది సమస్ఠిగా తీసుకున్న నిర్ణయమని వేములవాడ ముస్లిమ్ టౌన్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ముహమ్మద్ అక్రమ్, సయ్యద్ రసూల్ లు బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఆడపిల్ల పెళ్లిలో విందు ఏర్పాటు చేసే ఆచారానికి ఇస్లామ్ లో తావులేదని, అలాంటిది వారిపై విందు ఖర్చు మోపడం సబబు కాదని పలువురు పెదవి విరుస్తున్నారు. వేములవాడ ముస్లిమ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంతలో కొంతైనా ఊరటనిస్తుంది. రాష్ట్రంలోని ఖాజీలు కూడా వరకట్నం తీసుకునే వారి పెళ్లిళ్లు జరపబోమని తీర్మానించాలనే డిమాండు తెరపైకి వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..