Saturday, November 23, 2024

కబ్జా చేసి రంకెలేస్తున్న గ్రేటర్‌ ఇన్‌ఫ్రా..

ఓ భారీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ.. నిర్మించేది వందలాది కోట్లతో విల్లాలు.. కడుతున్నది మాత్రం కుంటను ఖతంపెట్టి అప్పనంగా కాజేసిన భూమిలో. అయితే, ఇక్కడే ఓ మతలబు ఉంది. ఇంతటి గ్రేటర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అస్సలు సర్వే నెంబర్‌ లేకుండానే కన్‌స్ట్రక్షన్‌ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారన్నది ఇప్పుడు లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నిండుగా నీళ్లున్న చెరువును మొత్తానికే లేకుండా చేసి, దాని ప్లేసులో విల్లాల నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడం.. ఆ పై అక్కడ అస్సలు చెరువు (కుంట) లేదని రుజువులు క్రియేట్‌ చేయడంలో అతి తెలివికి పోయారు కబ్జాదారులు. అయితే.. ఇవేవీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ మాత్రం కండ్లు మూసుకుని ఆ స్థలానికి మార్ట్‌ గేజ్‌ చేసింది. ఇలా, తవ్విన కొద్దీ గ్రేటర్‌ ఇన్‌ఫ్రా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కబ్జాదారుల చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి స్థానికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

చేసిందంతా చేసి ఏం ఎరుగనట్టు వ్యవహరిస్తున్న గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తీరు చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా తయారైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండిస్టీయల్‌ పరిధిలోని వర్రకుంట గాయబ్‌లో తన పాత్ర ఉన్నా కూడా ఏం లేదనట్లు అసలు వర్రకుంట తాము నిర్మించే స్థలంలో లేనేలేదని వాదిస్తూ వర్రకుంటను అన్యాక్రాంతం చేసే కుట్రలో కుతంత్రాలు రచిస్తూ గ్రేటర్‌ ఇన్‌ఫ్రా తనదైన శైలిలో రంకెలేస్తూ ముందుకు సాగుతోంది. ఓ వైపు రెవెన్యూ రికార్డులు, హెచ్‌ఎండీఏ లేక్స సైట్‌లోని ఎఫ్‌టీఎల్‌ మ్యాప్‌ గ్రేటర్‌ ఇన్‌ఫ్రా నిర్మించే ప్రాజెక్టు అంతర్బాగంలోనే వర్రకుంట ఉందని స్పష్టం చేస్తున్నా తనిఖీలు, రిపోర్టుల పేరుతో ఇరుశాఖలు తాత్సారం చేస్తున్నాయి. మరోవైపు నిర్మాణ అనుమతుల్లో స్పష్టమైన ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ లేకుండా హెచ్‌ఎండీఏ జేపీవో వ్యవహరించిన తీరుతో నిర్మాణ అనుమతులు జారీచేసిన హెచ్‌ఎండీఏ వైఖరి పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వర్రకుంట కాపాడే ప్రయత్నంలో ‘ఆంధ్రప్రభ’ అక్షరపోరాటం చేస్తున్నా బాధ్యతాయుతమైన శాఖలు మాత్రం మిన్నుకుండిపోయిన తీరును అందరూ ఎండగడుతున్నారు. అయినా ఆయా శాఖల్లో మాత్రం చలనం లేదు. ఫలితంగానే సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు నానాటికి అన్యాక్రాంతమవుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్ – సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 82,83లో విస్తరించిన వర్రకుంట(రెవెన్యూ రికార్డుల ప్రకారం యెర్రకుంట) ను నామరూపం లేకుండా చేసి అందులో 86 విల్లాలను గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్మిస్తుంది. నిర్మాణ అనుమతుల్లో భాగంగా రెవెన్యూశాఖను మేనేజ్‌చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు అమ్ముడుపోయిన 2019లోని జిన్నారం తహశిల్ధార్‌, సర్వేయర్లు గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు అనుకూలంగా స్కెచ్‌మ్యాప్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. స్కెచ్‌ మ్యాప్‌ ఆధారంగా గ్రేటర్‌ ఇన్‌ఫ్రా టీఎస్‌-బీపాస్‌ ద్వారా నిర్మాణ అనమతులకు దరఖాస్తు చేసుకని హెచ్‌ఎండీఏ ద్వారా గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు నిర్మాణ అనుమతులు పొంది ఏకంగా వర్రకుంట పైనే విల్లాలను నిర్మిస్తూ చకచకా పనులు కానిస్తుంది. దీని పై గత వారం రోజులుగా వరుస కథనాలతో ఆంధ్రప్రభ అక్షరపోరాటం చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించని తీరు చూస్తుంటే విస్తుకలిగిస్తుంది. ఆయా శాఖల సహకారంతోనే గ్రేటర్‌ ఇన్‌ఫ్రా వర్రకుంటను కబ్జాచేసి రంకెలేస్తుంది.

బొల్లారం ఇండస్ట్రీయల్‌ పరిధిలో సర్వేనెంబర్‌ 82లో గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సంస్థ 86 విల్లాల నిర్మాణం కోసం టీఎస్‌-బీపాస్‌ ద్వారా నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా హెచ్‌ఎండీఏ నిర్మాణ అనుమతులను జారీచేసింది. గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు నిర్మాణ అనుమతుల జారీ పత్రంలో సర్వేనెంబర్‌ లేకుండా సర్వేనెంబర్‌ స్థానంలో ఎన్‌ఏ అంటూ పేర్కొంటూ నిర్మాణ అనుమతులు జారీచేయడం విడ్డూరమనే చెప్పాలి. సర్వేనెంబర్‌ లేకుండా నిర్మాణ అనుమతులు జారీచేయడం ఒక ఎత్తౖతే సదరు సంస్థ మార్టిగేజ్‌ ఫైల్‌లో కూడా సర్వేనెంబర్‌ లేకుండానే హెచ్‌ఎండీఏ గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సంస్థకు మార్టిగేజ్‌ చేసుకున్నట్లు మార్టిగేజ్‌ డీడ్‌ చేసింది. మార్టిగేజ్‌ డీడ్‌లో కేవలం డాక్యుమెంట్‌ నెంబర్‌, డేట్‌ , గ్రామం, మండలం మాత్రమే వేసి హెచ్‌ఎండీఏ చేతులు దులుపుకుంది. అంతే హెచ్‌ఎండీఏకే తెలిసే ఈ తతంగం నిడిచిందా లేకా ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన జేపీవోతో పాటు పీవోను మేనేజ్‌చేసి గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు విల్లాలకు నిర్మాణ అనుమతులు మంజూరుచేయించుకుందా అనేది అంతుపట్టడం లేదు.

గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు అంతర్భాగంలోనే వర్రకుంట
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్‌ పరిధిలోని వర్రకుంట మాయం వెనుక గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు హస్తం ఉన్నట్లు స్పష్టమవుతుంది. గ్రేటర్‌ ఇన్‌ఫ్రా నిర్మిస్తున్న విల్లాల అంతర్భాగంలోనే వర్రకుంట ఉందని ఇటు రెవెన్యూ, అటు హెచ్‌ఎండీఏ రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. రెవె న్యూ రికార్డులు పరిశీలిస్తే అసల్‌ శేత్వార్‌లో సర్వేనెంబర్‌ 82,83 పక్కాగా సర్కారి జాగా అని స్పష్టంచేస్తుండగా 1983-1984 పహణి కాలంలో సర్వేనెంబర్‌ 82 లో 8-03 గుంటలు వర్రకుంట (రెవెన్యూ పహాణి రికార్డుల ప్రకారం యెర్రకుంట) ఉందని స్పష్టంచేస్తుండగా సర్వేనెంబర్‌ 83లో వర్రకుంట ( రెవెన్యూ పహాని రికార్డుల ప్రకారం) -038 గుంటల శిఖం భూమి ఉంది. ఇక హెచ్‌ఎండీఏ లేక్స్‌ సైట్‌లో అందుబాటులో ఉన్న వర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, కెడాస్ట్రాల్‌ మ్యాప్‌ ఆధారంగా ఎఫ్‌టీఎల్‌ కో-ఆర్డినేట్స్‌ ప్రకారం గూగుల్‌మ్యాప్‌లో టెక్నికల్‌గా ఫిక్స్‌చేస్తే గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులోనే ఏ1- ఏ14 వరకు ఎఫ్‌టీఎల్‌ పాయింట్లు వస్తున్నాయి. ఇంత స్పష్టంగా వర్రకుంట ఎఫ్‌టీఎల్‌ కో-ఆర్డినేట్‌ పాయింట్లు గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు అంతర్భాగంలోనే వస్తున్నా సంబంధిత శాఖలు గ్రేటర్‌ ఇన్‌ఫ్రా పై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు.

- Advertisement -

జాయింట్‌ సర్వేకు అర్థం లేదా..?
హెచ్‌ఎండీఏ పరిధిలో చెరు వులు, కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ద్వారా ఆర్వీ సంస్థకు సర్వే అప్పగించింది. ఆర్వీ సంస్థ చేసే సర్వేలో రెవెన్యూ, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ జాయింట్‌ సర్వేద్వారా భాగస్వా ములయ్యాయి. అయితే మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలో 2498 లేక్స్‌ ఉంటే ఫైనల్‌ నోటిఫికేషన్‌ ద్వారా 229 చెరువులను గుర్తించగా, ప్రైమరీ నోటిఫికేషన్‌ ద్వారా 2269 చెరువులను గుర్తిం చారు. జిన్నారం మండలం విషయానికొస్తే మొత్తం 91 చెరువులను గుర్తించగా ఫైనల్‌ నోటిఫికేషన్లో 2 చెరువులను గుర్తించారు. ప్రైమరీ నోటి ఫికేషన్‌లో 89 చెరువులు ఉన్నాయి. అయితే ప్రతి చెరువుకు ఎఫ్‌టీఎల్‌, కెడా స్ట్రాల్‌ మ్యాప్‌ల ద్వారా ఎఫ్‌టీఎల్‌ కో-ఆర్డినేట్‌ పాయింట్స్‌ ఫిక్స్‌ చేసి కెడాస్ట్రాల్‌ మ్యాప్‌లో చెరువు ఏ సర్వేనెంబర్లో ఉంది, ఆ చెరువుకు ఎంత ఎఫ్‌టీఎల్‌ ఉంది, ఏ తేదీన సర్వే నిర్వహించారు అనే విషయాలను పక్కాగా సైట్‌లో పొందు పర్చారు. ఇంత పక్కాగా హెచ్‌ఎండీఏ సైట్‌లో పొందుపర్చిన చెరువుల సర్వే ద్వారా ఆయా చెరువులను రక్షించే ప్రయత్నం హెచ్‌ఎండీఏ చేసింది. అయితే గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లాంటి కొన్ని బరితెగించిన నిర్మాణ సంస్థలు హెచ్‌ఎండీఏ సైట్‌లో పొందుపర్చిన సర్వేలకు అర్థమేలేనట్లుగా వ్యవహరిస్తూ వర్రకుంటను కబ్జాచేసి అందులోనే విల్లాలను నిర్మించడం వెనుక ఎంత బరితెగింపో అర్థం అవుతుంది. ఇకనైనా ఇరిగేషన్‌, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖలు మేల్కొని జలవనరులు అన్యాక్రాంతం కాకుండా కఠినం గా వ్యవహరించాలని లేకుండే భవిష్యత్‌తరాలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులోనే వర్రకుంట – దిలీప్‌, ఏఈ, ఇరిగేషన్‌,
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్‌ పరిధిలోని వర్రకుంట కబ్జాకు గురైన విషయమై ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీని పై ఉన్నతాధికారులు రెవెన్యూశాఖతో కలిసి సంయుక్తంగా సర్వేచేయాలని ఆదేశించారు. ఫలితంగా బొల్లారంలోని గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్మిస్తున్న విల్లాల వద్దకు వచ్చి రికార్డులను పరిశీలించాం. హెచ్‌ఎండీఏ ఎఫ్‌టీఎల్‌ మ్యాప్‌ ప్రకారం వర్రకుంట గ్రేటర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులోనే ఉందని స్పష్టమైన అంచనాకు వచ్చాం. హెచ్‌ఎండీఏ ప్రిలిమినరీ నోటీఫికేషన్‌ ద్వారా గుర్తించిన లేక్స్‌ సర్వే 100కు 100శాతం కరెక్టే. ఇప్పటికే గ్రేటర్‌ ఇన్‌ఫ్రా నిర్మిస్తున్న విల్లాలను నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీచేశాం. సోమవారం నాడు ఇరిగేషన్‌ చట్టం ప్రకారం లీగల్‌ నోటీసులు జారీచేస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement