ప్రముఖ విప్లవ రచయిత, విరసం నేత వరవర రావుకు బాంబే హైకోర్టు బెయిల్ ను పొడిగించింది. 2018 భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆగస్టు 28 నుంచి ఆయన జైలులో ఉన్నారు. అయితే, ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో గత ఏడాది ఆరు నెలల పాటు వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆగస్టులో సరెండర్ అవ్వాల్సి ఉన్నా బెయిల్ ను పొడిగించాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఆమోదించింది. తాజాగా ఈ రోజు ఆయన సరెండర్ విషయంపై జరిగిన విచారణలో భాగంగా మరోసారి బాంబే హైకోర్టు వరవరరావు బెయిల్ ను పొడిగించింది. థర్డ్ వేవ్ లో కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఈ సమయంలో మళ్లీ ఆయన్ను జైలుకు పంపించలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కరోనా థర్డ్ వేవ్ 50 నుంచి 60 రోజులు ఉండే అవకాశం ఉందని, చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మహమ్మారి బారిన పడుతున్నారని గుర్తు చేసింది. కరోనా మొదటి వేవ్, రెండోవేవ్ లో కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, కరోనా కేసులూ పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో ఆయన్ను జైలుకు పంపించాల్సిన అవసరం ఏముందంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులను ప్రశ్నించింది. వరవర రావుకు కేవలం ఆరు నెలలకు మాత్రమే బెయిల్ ఇచ్చారని, ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ ను పొడిగించారని ఎన్ఐఏ తరఫు అడ్వొకేట్ సందేశ్ పాటిల్ వాదించారు. ఎన్ఐఏ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. వరవర రావు మెడికల్ బెయిల్ ను ఫిబ్రవరి 5 దాకా పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..