Tuesday, November 19, 2024

ఆవుని ఢీ కొట్టిన వందేభార‌త్.. దెబ్బ‌తిన్న ట్రైన్ ముందుభాగం

ఆవుని ఢీకొట్టింది వందేభార‌త్ రైలు. భోపాల్‌-న్యూఢిల్లీ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ స‌మీపంలో ఆవును ఢీ కొన‌డంతో రైలు ముందుభాగం దెబ్బ‌తింది. భోపాల్ వెళ్లే వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ గ్వాలియ‌ర్‌లోని ద‌బ్రా వ‌ద్ద ఒక్క‌సారిగా ప‌ట్టాల‌పైకి వ‌చ్చిన ఆవును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌తో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేశారు. ట్రైన్ ముందుభాగం ధ్వంసం కావ‌డంతో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టిన అనంత‌రం రైలు ముందుకు క‌దిలిందని అధికారులు తెలిపారు. ఈ సెమీ హైస్పీడ్ రైలును ఏప్రిల్ 1న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే వ్య‌వ‌స్ధ‌లో స‌మూల మార్పులు చేప‌ట్టి పౌరుల‌కు రైలు ప్ర‌యాణాన్ని సౌక‌ర్య‌వంతంగా మారుస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ చెప్పారు. భోపాల్‌-న్యూఢిల్లీ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ 7.45 గంట‌ల్లో 708 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంద‌ని అన్నారు. మోడీ అట్ట‌హాసంగా ప్రారంభించిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ మూడు వారాలు గ‌డ‌వ‌క‌ముందే ఆవును ఢీకొని ట్రైన్ ముందుభాగం దెబ్బ‌తిన‌డంతో అంద‌రూ విస్తుపోతున్నారు. వేగమే కాదు రైళ్ల నాణ్య‌త‌పై కూడా దృష్టిసారించాల‌ని అంటున్నారు. గ‌తంలోనూ ప‌లు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆవును ఢీకొన‌డంతో ఆయా రైళ్లు పాక్షికంగా దెబ్బ‌తిన్న ఉదంతాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement