Tuesday, November 26, 2024

Big Story: వామ్మో, వ్యాసెక్టమీ.. ఆపరేషన్‌కు ముందుకు రాని మగాళ్లు!

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం ఆడవాళ్లు చేయించుకోవాలనే పాత విధానం కొనసాగుతోంది. మగవారికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారనే విషయం చాలామందికి అవగాహన లేకపోవడం, కొందరికి అవగాహన ఉన్నా చేయించుకుంటే ఏదో జరిగిపోతుందనే అనుమానంతో వాళ్లు కూడా ముందుకు రావడం లేదు. హైటెక్‌ యుగంలో అన్ని రంగాల్లో ముందున్న రంగారెడ్డి జిల్లాలో నెలలో మూడుకంటే తక్కువ మంది మంగాళ్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారంటే సమన్వయం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటేనే మహిళలు చేసుకోవాలనే పాత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మగవాళ్లుకూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవచ్చు. కానీ, చాలామందికి అవగాహన లోపంతో చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చ‌నిపోయారు. ఆ నలుగురికి ఐదేళ్లలోపు చిన్న పిల్లలున్నారు. వీళ్లంతా తల్లులు లేని పిల్లలుగా మిగిలిపోయారు. స్టెరిలైజేషన్‌ సక్రమంగా చేయకపోవడంతో నలుగురి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.

నెలకు ఇద్దరు లేదా ముగ్గురే..
జిల్లాలో వ్యాసెక్టమి ఆపరేషన్లు చేయించుకునేందుకు కొందరు మగవాళ్లు మాత్రమే ముందుకు వస్తున్నాయి. జిల్లాలో నెలలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మిగతా వాళ్లు మాత్రం అమ్మో వ్యాసెక్టమినా అని భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 2021-22 సంవత్సరంలో జిల్లాలో కేవలం 27మంది మాత్రమే మగవాళ్లు వ్యాసెక్టమి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. వీరందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించుకున్న వారే. చిన్నపాటి జ్వరం వచ్చినా ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు పరుగులు తీసే జనం వ్యాసెక్టమి విషయంలో మాత్రం ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు వెళ్లడం లేదు. 2022-23 సంవత్సరానికి గాను ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి కేవలం 8 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ (వ్యాసెక్టమి) ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇందులో ఏప్రిల్‌ మాసంలో 3, మే లో 1, జూన్‌లో 2, జులై మాసంలో ఎవరూ కూడా వ్యాసెక్టమి చేయించుకోలేదు.

ఆగస్టులో కేవలం ఇద్దరు మాత్రమే
మగవాళ్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే పటుత్వం పోతుందనే అనుమానాలు నెలకొన్నాయి. వీటిని వైద్య బృందాలు సరైన అవగాహన కల్పించకపోవడంతో వాళ్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది కేవలం రంగారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య ఉన్న‌ట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాస్త నయమనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాసెక్టమి ఆపరేషన్లు చేయించుకునేందుకు మగవాళ్లు కొంతమేర ముందుకు వస్తున్నారు.

పట్టణ ప్రాంతాల్లోచదువుకున్న వాళ్లు ఎక్కువమంది ఉంటారు. వీరిలో కొంత శాతం మంది కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. అన్ని తెలిసి కూడా వాళ్లు వ్యాసెక్టమి వైపు చూడని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర అవగాహన పొందుతున్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులకు కూడా హాజరుకాని పరిస్థితులు నెలకొన్నాయి. మగవాళ్లు ఆపరేషన్లు చేయించుకోకుండా ఇంటి పెద్దలు కట్టడి చేసే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సంపాధించే వ్యక్తులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే బలహీనపడిపోతారని వారించే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద కమ్యూనిటీల్లో మార్పు వస్తేనే మగవారిలో కొంతమేర మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికితోడు ప్రభుత్వం కూడా వ్యాసెక్టమి ఆపరేషన్లపై పెద్దఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ముందుగా మగవారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. వ్యాసెక్టమి చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావనే భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

అవగాహన కల్పిస్తున్నా ముందుకు రావడం లేదు: డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి
వ్యాసెక్టమి విషయంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రావనే విషయం సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. అప్పటివరకు సరేనని చెబుతున్నా తరువాత అటువైపు రావడం లేదు. వ్యాసెక్టమి ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కొందరు మినహా మెజార్టీ వాళ్లు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాస్త నయం. ఈ ప్రాంతాల వాళ్లు వ్యాసెక్టమి చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement