న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నాగాలాండ్ రాజధాని కోహిమాలో మూడ్రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ చివరి రోజు నార్త్ ఈస్ట్ ఫ్యాషన్ షో తో ముగిసింది. భిన్న జాతులు, విభన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన ఈశాన్య భారతదేశంలో, కట్టుబొట్టు కూడా ఎంతో భిన్నత్వాన్ని కలిగి ఉంది. వారి జీవనశైలికి తగ్గట్టు ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరిస్తూ, తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్ ఫ్యాషన్ షో నిర్వహించి, అక్కడి కట్టుబొట్టుకు ఆధునికత, సృజనాత్మకతను జోడించి సరికొత్త ఫ్యాషన్స్ ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. ఈ షో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ కే హైలైట్‌గా నిలిచింది. అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులను ఈ ఫ్యాషన్ షో, మ్యూజికల్ నైట్ ఆకట్టుకున్నాయి. అలాగే కోహిమా పట్టణంలోని 2వ ప్రపంచ యుద్ధం నాటి వార్ సెమెట్రీ (యుద్ధవీరుల సమాధులతో కూడిన ప్రాంతం)ను ప్రతినిధులు సందర్శించారు.
అనంతరం కోహిమా పట్టణంలోనే ఎత్తైన శిఖరం ఉన్న పులిబాజే వన్యప్రాణుల అభయారణ్యాన్ని కూడా సందర్శించారు. అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన వృక్ష, జంతు జాతులకు నిలయమైన ఈ ప్రాంతం అనేక పక్షిజాతులకు కూడా ఆవాసంగా ఉంది. ఈ అభయారణ్యంలోని లోయ అనేక పుష్ప జాతులకు నిలయం. అవి పుష్ఫించే కాలంలో పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. లోయలో ఉన్న ఖోనోమా గ్రామాన్ని సందర్శించేందుకు కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..