దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతుండటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు దేశంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాకినేషన్ చేశామని వెల్లడించింది. వారిలో 21,18,682 మంది 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్కులకు మొదటి డోసు, 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేశామని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 40,44,67,526 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
అయితే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి ఆరు నెలలు పూర్తైంది. కానీ ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ లభించింది. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది.
జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకా డోసుల సరఫరా తగ్గిపోయి, కొత్త వ్యాక్సీన్లకు అనుమతులు లభించడం ఆలస్యం కావడంతో కొన్ని నెలలపాటు మందకొడిగా సాగింది. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నారు.
ఇది కూడా చదవండి:11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ చదివే అవకాశం.. తెలుగులోను..