Saturday, November 23, 2024

డిసెంబర్ నాటికి దేశంలో వ్యాక్సినేషన్ పూర్తవుతుందా..?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ మందగిస్తోంది.. ఇక థార్డ్ వేవ్ ముసుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతలో డెల్టా ప్లస్ వేరియంట్లతో పాటు మరికొన్ని వేరియంట్లు దాడి చేస్తున్నాయి. అయితే ఇవి ఎంత వరకు వేగంగా విస్తరిస్తాయనేది ఇంకా పక్కగా సమాచారం లేదు. అయితే ఎన్ని వేరియంట్లు వచ్చిన అందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే ప్రమాదం నుంచి దాదాపు బయటపడ్డట్లే నని నిపుణులు మొదటి నుంచి చెబతూవస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా టీకా డోసులు అందజేసేలా సవరించిన మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమలులోకి వచ్చాయి.

జూన్ 19-25 మధ్యలో 3.98 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. వారం రోజుల వ్యవధిలో సుమారు 4 కోట్ల టీకాలు వేసి ప్రభుత్వాలు రికార్డు సృష్టించాయి. అంతకుముందు ఏప్రిల్ 3-9 మధ్యన వేసిన టీకాలే అత్యధికం. ఆ వారంలో 2.47 కోట్ల మంది టీకాలు స్వీకరించారు. అదేవిధంగా మే 12-18 మధ్యకాలంలో అత్యల్పంగా 92లక్షల టీకా డోసులే అందాయి. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద మొదట 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేసింది. తరవాత నిర్ణయాన్ని మార్చుకొని 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించడం ప్రారంభించింది. జూన్‌ 21 నుంచి వారిని టీకా కార్యక్రమంలో భాగం చేసింది. ‘జూన్‌లో ఈ వారం సుమారు నాలుగు కోట్ల టీకాలు అందించాం. ఈ గణాంకాలు టీకా కార్యక్రమంలో స్థిరమైన పెరుగుదలను చూపిస్తున్నాయి. ఇదే తరహాలో జులైలో 20 కోట్ల డోసులు, ఆగస్టులో 30 కోట్ల డోసులను పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తోంది’ అని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ వేగం ఇలాగే కొనసాగితే.. దేశంలో 94 కోట్ల మందికి వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిగా టీకాలు వేయొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోపక్క ఈ 3.98 కోట్ల డోసుల్లో 70 శాతం టీకాలు 18-44 ఏళ్ల మధ్య వయస్కులే వేయించుకున్నారు. 45 ఏళ్లు పైడినవారికి అధిక ప్రాధాన్యమిస్తూ, వారు తప్పకుండా రెండో మోతాదును తీసుకోవాలని ప్రభుత్వం చెప్తుండగా.. 18-44 ఏళ్ల వయస్సు వారినుంచి మొదటి డోసుకోసం ఒత్తిడి వచ్చింది. కాగా జులై నుంచి పంపిణీ అయ్యే టీకా డోసుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు రోజుకు పదిలక్షల డోసులను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాయి. సరిపడా టీకాలు అందిస్తే.. రోజుకు 15లక్షల మందికి టీకా వేయగలమని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది. జూన్ 25న ఈ రాష్ట్రం 9 లక్షలకు పైగా టీకాలు వేసింది. ఈ లెక్క మరింత పెరిగితే జులైలో వారానికి 5 కోట్ల మంది టీకా తీసుకోనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర అత్యధికంగా 3.03 కోట్ల మందికి టీకాలు వేయగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆ సంఖ్య 2.99 కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement