న్యూఢిల్లి : కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌లు శక్తిని అందించాయని, ఈ ఘనత చూసి భారత్ ఎంతో గర్వపడుతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి ఆదివారానికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎంతో మందికి కరోనా మహమ్మారి నుంచి రక్షణ కూడా కల్పించామన్నారు. మహమ్మారి భారత్‌లో అడుగుపెట్టిన సమయంలో.. వైరస్ గురించి పెద్దగా ఎలాంటి విషయాలు తెలీవని తెలిపారు. భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు ఎంతో కష్టపడి కరోనాకు విరుగుడు తయారు చేశారని కొనియాడారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారు చేయడంలో వీరంతా మునిగిపోయారని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ఘనత చూసి.. దేశం ఎంతో గర్వపడుతున్నదని తెలిపారు. వ్యాక్సిన్‌ల ద్వారా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతీ ఒక్కరూ సహకరించారని, దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వైద్య ఆరోగ్య కార్యకర్తల కృషి అభినందనీయమని కొనియాడారు. డాక్టర్లు, నర్సులు కూడా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
సైన్స్ ఆధారంగానే పోరాటం
ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కష్టపడి.. రిమోట్ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ఇది చూసి.. దేశంలోని ప్రతీ ఒక్కరి మనస్సు, హృదయం గర్వంగా నిడిపోతుందన్నారు. మహమ్మారిపై పోరాటంలో భారతదేశం అనుసరిస్తున్న విధానం.. ఎల్లప్పుడూ సైన్స్ ఆధారితంగానే ఉంటుందని, అందరికీ సరైన రక్షణ కల్పించేలా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని, అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఈ సందర్భంగా మోడీ సూచించారు. ఏడాది కాలంలో.. 156.76 కోట్ల వ్యాక్సిన్‌లను ఉపయోగించామన్నారు. దేశంలోని 92 శాతం ప్రజలు.. కనీసం ఒక డోసు తీసుకున్నారని, 68 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని వివరించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి ఏడాది కాలం అయిన సందర్భంగా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభించగా.. ఫిబ్రవరి 19 నాటికి కోటి డోసులు, ఏప్రిల్ 1కి 10 కోట్ల డోసుల మైలురాయిని అందుకున్నారు. ఆగస్టు 6 నాటికి 50కోట్ల డోసులు, అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసులకు చేరుకున్నారు. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించడంతో.. జనవరి 7 నాటికి 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉపయోగించారు. జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు ప్రారంభమైంది.