తెలంగాణలో ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పని ప్రదేశాల్లో 18 ఏళ్ళు దాటినా వారికి వ్యాక్సినేషన్ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంతేకాదు గేటెడ్ కమ్యూనిటీల్లో టీకాలు వేయడానికి ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో టీకాలు వేయడానికి మెడికవర్ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 70 దాకా గేెటెడ్ కమ్యూనిటీలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ మేరకు ఆస్పత్రులతో పాటు… పని ప్రదేశాల్లో వాక్సినేషన్ వేయాలని పేర్కొన్నారు డిహెచ్.