కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అరుదైన ఘనత సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచింది. ఇప్పటివరకు చైనా మాత్రమే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించింది. దేశంలో మొదట నెమ్మదిగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కొన్ని నెలలకే స్పీడందుకుంది.
దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 19న కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా ఇండియా నిలిచింది.
ఈ ఏడాది జూన్ 12న 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్తయింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం కంప్లీట్ అయ్యిందని కొవిన్ పోర్టల్‌లో పేర్కొన్నారు. మొదట వ్యాక్సిన్లు వేయించుకునేందుకు భయపడ్డ ప్రజలు అనంతరం పెద్ద ఎత్తున టీకా కేంద్రాలకు తరలివెళ్లి వేయించుకోవడం గమనార్హం.