Sunday, November 17, 2024

యూపీలో ఎస్‌పీ ఫ్రంట్‌? .. బీజేపీని ఢీకొట్టేందుకు అఖిలేశ్‌ వ్యూహం ..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కొన్ని నెల‌ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ వ్యూహాత్మక ప్రణాళికల‌ని రచిస్తోంది. అధికార భారతీయ జనతాపార్టీని ఢీకొట్టేందుకు బలమైన జట్టును నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. పెద్దగా ప్రభావం చూపని కాంగ్రెస్‌ వంటి పెద్దపార్టీలకు దూరంగా, భవిష్యత్‌లో కూట‌మికి లేదా ప్రభుత్వానికి ఇబ్బందుల్లేని చిన్నా చితకా పార్టీలతో కొత్త సమూహాన్ని నిర్మించాలని అఖిలేశ్‌ యోచిస్తున్నారు. ఇప్పటికే అలాంటి భావసారూప్య పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులోఎస్‌బీఎస్‌పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ ఉన్నాయి. ఆర్‌ఎల్‌డీ అధినేత చౌదరి జయంత్‌ సింగ్‌ సమాజ్‌వాది కూటమిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు (మంగళవారం) మీరట్‌ జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ఆర్‌ఎల్‌డీ-ఎస్‌పీ పొత్తు గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాజ్‌వాది వర్గాలు తెలిపాయి. ఈ శుభముహూర్తానికి నేటి ర్యాలీని మెగా ఈవెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమ యూపీలో ఆర్‌ఎల్‌డీకి గట్టి ఓటు బ్యాంకు ఉంది. రెండు పార్టీలు కలసిపోటీ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని అఖిలేశ్‌ ధీమాతో ఉన్నారు.

మీరట్‌ ర్యాలీకోసం యూపీ ఎస్‌పీ చీఫ్‌ నరేశ్‌ ఉత్తమ్‌ పటేల్‌, ఎన్నికల కోఆర్డినేటర్‌ సంజయ్‌ లాథర్‌ ఇప్పటికే అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ బహిరంగసభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భాయ్‌చారా జిందాబాద్‌ నినాదంతో ఈ ర్యాలీని హోరెత్తించనున్నారు. 2013 ముజఫర్‌ నగర్‌ అల్లర్ల తర్వాత యూపీ పశ్చిమ ప్రాంతంలో ఇదే నినాదంతో ఆర్‌ఎల్‌డీ ప్రచారయాత్రలు చేపట్టింది. మరోవైపు రైతు సంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను సమాజ్‌వాది పార్టీ చక్కబెడుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. ఇంకొకవైపు కుల ఆధారిత జనగణన హామీని విస్తృతంగా ప్రచారం చేయాలని మరొక మిత్రపక్షం ఎస్‌బీఎస్‌పీ భావిస్తోంది. సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తే కుల ఆధారిత జనగణన చేపడతామని బీసీ వర్గాలకు గాలం వేస్తోంది. ఇప్పటికే ఈ నినాదాన్ని ఆ పార్టీ అధినేత ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ పలు వేదికలపై వెల్లడించారు.

మమత మద్దతు..

- Advertisement -

భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. శక్తివంతమైన కూటమి నిర్మాణానికి పావులు కదుపుతున్నారు. ఈ కోణంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతానికి సమాజ్‌వాది పార్టీకి ఆమె మద్దతివ్వడానికి సిద్ధమయ్యారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లిd ఎన్నికల సమయంలో దీదీకి మద్దతుగా నిలవాలని అక్కడవుండే యూపీ వాసులకు అఖిలేశ్‌ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతిగా రాబోయే యూపీ అసెంబ్లిd ఎన్నికల్లో మమతాబెర్జీ కూడా స్నేహపూర్వక కృతజ్ఞత ప్రదర్శించనున్నారు. పొత్తులు, సీట్లతో సంబంధం లేకుండా సమాజ్‌వాది పార్టీకి మద్దతివ్వాలని టీఎంసీ అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చిందని, అందుకు ఇటీవలి పరిణామాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement