Wednesday, November 20, 2024

Python: స్కూలు బస్సులో భారీ కొండచిలువ మకాం.. ఆదివారం కావడంతో పిల్లలు బతికిపోయారు (వీడియో)

అదో స్కూలు బస్సు.. రోజూ చిన్నపిల్లలను స్కూలు నుంచి ఇంటికి చేర్చే డ్యూటీ ఆ బస్సు డ్రైవర్​ది. ఆదివారం కావడంతో ఇంటి దగ్గరే పార్క్​ చేశాడు. అయితే.. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో ఆ చుట్టుపక్కల వారు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో మకాంపెట్టి ఉంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఆదివారం జరిగింది. బస్సులో దాక్కున్న అతి పెద్ద కొండచిలువను ప్రాణాలతో బయటికి తీశారు. ర్యాన్ పబ్లిక్ స్కూల్ బస్సు సీటు కింద ఆ కొండచిలువ దాక్కుంది. ఈ సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకుని అటవీ శాఖ బృందాన్ని పిలిపించారు. ఆ కొండచిలువను సురక్షింగా బయటికి తీయించారు.

కాగా, కొండచిలువను అటవీశాఖ అధికారులు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుండి కొండచిలువను లాగడం చూడవచ్చు. సుమారు గంటపాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత కొండచిలువను ఎలాగోలా బయటికి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఆదివారం కావడం, పాఠశాల మూసివేయడంతో ఎట్లాంటి అపాయం జరగలేదు.  పాఠశాల బస్సు డ్రైవర్ గ్రామంలో పార్క్ చేయగా అది బస్సులోకి వచ్చినట్టు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement