Thursday, November 21, 2024

User Charges | యూజర్లపై యూపీఐ చార్జీల భారం ఉండదు.. ప్రకటించిన ఎన్‌పీసీఐ

ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీల విషయంలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) బుధవారం నాడు వివరణ ఇచ్చింది. బ్యాంక్‌ నుంచి బ్యాంక్‌ అకౌంట్‌ను డబ్బుల చెల్లింపులకు, సాధారణ యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇస్ట్రూమెంట్స్‌ (పీపీఐ) లావాదేవీలపై మాత్రమే ఛార్జీలు ఉంటాయని తెలిపింది. ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ప్రీపెయిడ్‌ పేమెంట్స్‌ (పీపీఐ) ద్వారా చేసే యూపీఐ మర్చింట్‌ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని ఎన్‌పీసీఐ సిఫారసు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతిపాదించింది.

సెప్టెంబర్‌ 30న లేదంటే అంతకు ముందే దీనిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్‌పీసీఐ సర్క్యులర్‌ ప్రకారం 2000 రూపాయలకు పైగా జరిగే లావాదేవీల విలువో 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీని వసూలు చేయాలని ప్రాతిపాదించింది. అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తే వాలెట్‌ లోడింగ్‌కు సేవా ఛార్జీని బ్యాంక్కు చెల్లించాల్సి ఉంటుంది. పీ2పీ, పీ2పీఎం లావాదేశీలకు బ్యాంక్‌ ఖాతా, పీపీఐ వాలెట్‌కు ఎటువంటి ఛార్జీలు ఉండవు. వాలెట్‌లను జారీ చేసే బ్యాంక్‌లు, పేమెంట్‌ బ్యాంక్‌ల వంటి వాటికి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చెల్లించే రుసుములనే ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ అంటారు. లావాదేవీల ధృవీకరణ, ప్రాసెసింగ్‌కు అయ్యే వ్యయాల కోసం ఈ ఛార్జీని వసూలు చేస్తారు.

రోజువారి యూపీఐ చెల్లింపులపై…
ఈ ఛార్జీలు రోజువారి యూపీఐ చెల్లింపుపై అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఇది వాస్తవం కాదని, యూపీఐ రోజువారి చెల్లింపులకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య, వ్యక్తుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు.

- Advertisement -

లోడింగ్‌ ఛార్జీలు కూడా…
పీపీఐ ద్వారా రూ 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపిగతే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాలెట్‌ లోడింగ్‌ సేవా రుసుం కూడా వర్తిస్తుంది. పేటీఎం, గూగుల్‌ పే వంటి పీపీఐ జారీ సంస్థలు 15 బేసిస్‌ పాయింట్లు వాలెట్‌ లోడింగ్‌ ఛార్జీని ఖాతాదారుడి బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ పీపీఐ జారీ సంస్థలు దీన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే మాత్రం లోడింగ్‌ ఛార్జీల భారం యూజర్లపై పడుతుంది.

ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీల్లోనూ తేడాలు..
మర్చంట్‌ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ ఛార్జీలు 0.50 నుంచి 1.10 శాతం మధ్య ఉంటాయని తెలిపింది. వాలెట్‌ ఉపయోగించే చేసే చెల్లింపులకు ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీలు వర్తిస్తాయి. ఆయా సంస్థలు వినియోగదారుడిపైకి వీటిని బదిలీ చేస్తే యూజర్లు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా యూపీఐ చెల్లింపులకు బ్యాంక్‌ అకౌంట్‌ను లింక్‌ చేస్తారు. మొత్తం చెల్లింపుల్లో ఇలాంటి చెల్లింపులే 99.9 శాతం ఉంటాయని అంచనా. పీపీఐ వాలెట్స్‌ను ఉపయోగించి చేసే చెల్లింపులకు మాత్రం ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement