రానున్న వారం రోజుల్లో మూడు కీలక శాఖల్లో ఉద్యోగ భర్తీ నియామక నోటిఫికేషన్లు వెల్లడించేందుకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలో తాను ప్రకటించిన అన్ని ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలని మంత్రులు, అధికారులకు ఆయన కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో సత్వర ఉద్యోగ నియామకాలకు ఇకపై నెలవారీ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఆంధ్రప్రభ, హైదరాబాద్: రానున్న ఆరు నెలల్లోగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 80వేల నియామకాలను పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు. దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కనిపిస్తూ పాలనలో జాప్యం తలెత్తుతోంది. నోటిఫికేషన్ల జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్‌మెంట్ ఆర్డర్ల జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కార్ కృషి చేస్తోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ఇందులో టీఎస్‌పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఈ దిశలో టీఎస్‌పీఎస్సీ, పోలీస్ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థలను ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్‌ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకొచ్చి నియామకాలను ఏనెలాకానెల పూర్తి చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. ఒకే పోటీ పరిక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్ధులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి నియామకాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన జోనల్ విధానానికి అవసరమైన అన్ని ఆమోదాలు లభించిన నేపథ్యంలో నియామక నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో అతిత్వరలో తొలుత పోలీస్ నియామకాలకు పచ్చ జెండా ఊపనున్నది. ఈ తరుణంలో వాస్తవంగా ఉన్న ఖాళీలు, అవసరమయ్యే పోస్టుల భర్తీ, పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సేకరించింది.
కాగా పీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రభుత్వం గుర్తించింది. కానీ వాస్తవానికి 80,039 పోస్టులకు ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయని , వాటిని వివిధ నియామక సంస్థలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రకటించింది. మరోవైపు రిటైర్మెంట్ వయో పరిమితి పెంచిన కారణంగా వచ్చే మూడేళ్లపాటు ఎటువంటి రిటర్మెంట్లు ఉండవని, దీంతో ఖాళీలు పెరిగేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. కాగా గడచిన ఏడేళ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 36,643 ఉద్యోగాల భర్తీ చేపట్టగా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుద్వారా 18,373 పోస్టులను, సింగరేణిలో 12,500, ట్రాన్స్‌కో, జెన్‌కోలో 5096 పోస్టులను, టెట్ ద్వారా 2932 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టినట్లు లెక్కలున్నాయి. ఏడేండ్లలో 1.35లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది.