Friday, November 22, 2024

Big Story: పేదింట పెళ్లికి ‘ఉప్పల’ సారె.. తల్లిదండ్రులే స్ఫూర్తిదాతలు అంటున్న శ్రీనివాస్​ గుప్తా!

పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయలేక అవస్థలు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబం నుంచి సారె అందుతోంది.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలు అడ్డంకులు లేకుండా జరుగుతున్నాయి. అయితే.. తన తల్లిదండ్రుల ఆశయస్ఫూర్తితో ఉప్పల శ్రీనివాస్ గుప్తా వ్యవస్థాపకుడిగా ఏర్పాటు చేసిన ఉప్పల ఫౌండేషన్‌తో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలకు పైగా ఉచితంగా పుస్తెమెట్టెలు, చీర, గాజులు, పండ్లు, తాంబూలంగా అందించి.. పేదల పెళ్లికి హితోదికసహకారం అందిస్తూ వస్తున్నారు ఉప్పల శ్రీనివాస్‌ గుప్త – స్వప్న దంపతులు. కరోనా ప్రారంభం నుంచి తన ఫౌండేషన్‌ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు.. విపత్తు వేళ ఆపన్నులకు అండగా నిలిచారు. ఆసరా కల్పించేలా తన కుటుంబ సభ్యులందరినీ సామాజిక సేవలో ప్రత్యక్ష భాగస్వాములను చేశారు. దాదాపు 15వేల కుటుంబాలకు నిత్యావసరాలను అందజేయడం గమనార్హం.

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా ఒంటరిగా ఉద్యమాన్ని ప్రారంభించి.. లక్షలాదిమంది గొంతుకగా సమరం సాగించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సారథి కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ రాజకీయనేతగా కొనసాగుతున్నారు. అదే చింతమడక పక్కనే ఉన్న లక్ష్మిదేవిపల్లి గ్రామం నుంచి జనంకోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

అటు అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్‌) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధ్యక్షుడిగా.. ఖైరతాబాద్‌ వాసవీ సేవాకేంద్రం ట్రస్టీగా.. ఉప్పల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడిగా.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్‌ పార్టీ సీనియర్ లీడ‌ర్‌గా కీల‌క‌ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు శ్రీనివాస్ గుప్తా.. ఆపదంటూ వచ్చే వారికి నేనున్నాన‌ని గడిచిన రెండు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారు.

తండ్రి విశ్వనాథం స్ఫూర్తి.. అమ్మ అనంతలక్ష్మి ఆశయం!
సిద్దిపేట జిల్లా, లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఉప్పల విశ్వనాథం – అనంతలక్ష్మి దంపతులకు 1972 మే 5న జన్మించిన శ్రీనివాస్ గుప్తా, తన విద్యాభ్యాసాన్ని అక్కడే కొనసాగించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యనభ్యసించారు. ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న సమయంలోనే తల్లి అనంతలక్ష్మి కాలం చేయడం ఆయనను కలచివేసింది. అదేవిధంగా 2002 జులై 11న తండ్రి సైతం రక్తపోటు అధికమై చ‌నిపోయారు.

- Advertisement -

అప్పటికే స్వప్న‌తో వివాహం జరిగి, వ్యాపారంలో కొనసాగుతున్నారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తన తల్లిదండ్రుల పేరిట ఏదైనా ఒక సంకల్పం తీసుకొని సేవ చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేశారు. అందుకు ఆయన సతీమణి స్వప్న సంపూర్ణ సహకారం అందించడంతో ఉప్పల ఫౌండేషన్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. నాటి నుంచి నేటి దాకా నిరంతరాయంగా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి.

కదిలించిన కరోనా.. ఖర్చుకు వెరవకుండా సేవలు..
అటు రాజకీయంగా, ఇటు వ్యాపార పరంగా, కుటుంబంతో సంతోషంగా ఉప్పల శ్రీనివాస్‌ను కరోనా విపత్తు కదిలించింది. పొట్టచేత పట్టుకొని విలవిలలాడుతున్న అనేక కుటుంబాల వెతలు ఆయనలో దాగి ఉన్న సామాజిక సేవాగుణాన్ని తట్టి లేపాయి. గుమ్మంలోకి ఎవరైనా వస్తే తలుపులు తీయడానికే భయపడిన రోజుల్లో సామాజిక సేవచేయడం కత్తిమీద సాముగా మారింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది బాధిత కుటుంబాలకు తన కుటుంబ సభ్యులందరి ప్రత్యక్ష సహకారంతో నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

దాదాపు 100 రోజులకు పైగా బియ్యం, నూనె, పప్పులు, నిత్యావసరాలు ఉండేలా 2500 విలువ చేసే కిట్‌ను జూట్‌ బ్యాగ్‌ల్లో పెట్టి, దాదాపు 15వేల కుటుంబాల ఆకలి తీర్చారు. అంతేకాకుండా అనాథాశ్రమాల్లో అన్నదానం చేసి, ఎందరో అభాగ్యుల ఆక‌లి బాధ‌ను తీర్చారు. ఇలా కరోనా వేళ తన సతీమణి స్వప్న, కుమారులు సాయికిరణ్‌, సాయితేజతో కలిసి ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచారు.

ప్రతిభకు గుర్తింపు.. క్రీడాకారులకు సహకారం..
ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ఉన్నత చదువులను కొనసాగించలేక అవస్థ ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికి ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫీజులు చెల్లించడం, చదువులకు అడ్డంకులు లేకుండా తోడ్పాటునందించడం చేస్తున్నారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అంతేకాకుండా వందల మంది విద్యార్థులకు అండగా నిలిచి, వారి చదువులు నిరాటకంగా కొనసాగేలా చూస్తున్నారు. పలు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికై, ఆర్థిక సహకారం కోసం ఎదురుచూసే వారికి తోడ్పాటునిచ్చి, వారు క్రీడల్లో రాణించేందుకు సాయం చేస్తున్నారు.

పుస్తెమెట్టెల పంపిణీతో రాష్ట్రస్థాయి గుర్తింపు..
పేదింటి ఆడబిడ్డలు, ప్రత్యేక అవసరాలు కలిగిన ఎందరో ఆడపడుచుల వివాహానికి పుస్తెమెట్టెలు అందించడం ద్వారా ఉప్పల ఫౌండేషన్‌ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పటికే ఫౌండేషన్‌ ద్వారా దాదాపు 5 వేల మంది వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు, పండ్లు అందిస్తూ వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచులు, వైశ్య నాయకుల ద్వారా ఎన్నో కుటుంబాలకు చెందిన పెళ్లి కుమార్తెలు ఉప్పల ఫౌండేషన్‌ను సంప్రదిస్తే, వారికి రవాణా ఖర్చులు భారం కాకూడదన్న భావనతో వారి చెంతకే వాటిని పంపిస్తున్నారు. సతీమణి స్వప్న సైతం ఈ కార్యక్రమాల్లో సంపూర్ణంగా భాగస్వామ్యం వహించడంతో పాటు, సేవా కార్యక్రమాల్లో రాణిస్తుండటం గమనార్హం.

సేవే లక్ష్యం.. ‘ఆంధ్రప్రభ’తో ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ఆర్యవైశ్య జాతిలో అంతర్లీనంగా ఇమిడీకృతమై ఉన్న సామాజిక స్ఫూర్తితోనే తాను పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆయన ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశయాన్ని కొనసాగించేందుకు ఫౌండేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీవెనలు, మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, సేవా కార్యక్రమాల నిర్వహణలో తన సతీమణి స్వప్న సహకారం, కుమారులు సాయికిరణ్‌, సాయితేజ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛంద సేవలో లభిస్తున్న తృప్తి తనకెంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement