స్మార్ట్ఫోన్లలో ఎన్ని కంపెనీలు వచ్చినా.. ఆపిల్ ఉత్పత్తులకు ఉండే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందులో ఉన్న సెక్యూరిటీ, ఫీచర్లే దీనికి ప్రధాన కారణంగా చెబుతుంటారు టెక్ ఎక్స్పర్ట్స్. ప్రధానంగా దీనిలో ఉండే ఐవోఎస్ కూడా సేఫ్టీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అందుకే ఆపిల్ కంపెనీ కూడా తమ ఓఎస్‌ను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేస్తూ కస్టమర్లకు కొత్త ఫీల్‌ను ఇస్తుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ఫీచర్లతో మరో అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకొచ్చింది ఆపిల్ కంపెనీ. సెప్టెంబర్‌లో ఐవోఎస్ 16 విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఐఓఎస్ 16కు సంబంధించిన పలు కీలక అంశాల అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం..
లాక్ స్క్రీన్
లాక్ స్క్రీన్కు సంబంధించి చాలా రోజుల తర్వాత ఆపిల్ కంపెనీ భారీ మార్పులు తీసుకొచ్చింది. ఒకేసారి ఒకటికి మించి ఎక్కువగా లాక్స్క్రీన్స్ను సెట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. సింగిల్ స్వైప్ ద్వారా కావాల్సిన లాక్‌స్క్రీన్ డిస్ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. స్టాటిక్ వాల్‌పేపర్ లేదా లైవ్ వాల్‌పేపర్ ఏదైనా సరే అందులో డేట్, టైమ్‌ను కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫాంట్, కలర్ కూడా మార్చుకోవచ్చు. కేవలం టైమ్ కోసమే కాకుండా ఇతరత్రా విడ్జెట్స్‌ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. విడ్జెట్ సైజ్ మార్చుకోవడంతో పాటు.. ఫొటో వెనక డిస్ ప్లే అయ్యేలా కూడా చేంజ్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొస్తున్నారు.
నోటిఫికేషన్స్
ఈ సారి నోటిఫికేషన్ బ్లాక్‌ను స్క్రీన్ కిందకు మార్చారు. ఎక్స్పాండెడ్ వ్యూతో వీటిని తీసుకొస్తున్నారు. సింగిల్ క్లిక్‌తో ఒకరోజు పాటు నోటిఫికేషన్స్‌ను హైడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు.
లైవ్ యాక్టివిటీస్..
స్విగ్గీ, జొమాటోలో ఏదైనా ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ స్టేటస్ చూడాలన్నా.. ఓలాలో ఏదైనా రైడ్ బుక్ చేసుకుంటే క్యాబ్ లొకేషన్ లైవ్ ట్రాకింగ్ చేయాలన్నా దీనికి సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఐవోఎస్ 16లో తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్‌తో హోం స్క్రీన్ మీదనే వాటన్నింటినీ తెలుసుకోవచ్చు. అంతేకాదు కావాలంటే క్రికెట్ మ్యాచ్ లైవ్ స్కోర్ కూడా ఇక హోం స్క్రీన్ చూడటం ద్వారానే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఫోకస్..
ఫోకస్ ఫీచర్లో కొత్తగా ఫిల్టర్స్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా పర్సనల్, వర్క్, స్లీప్ ఇలా కావాల్సిన మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫీసులో ఉన్నప్పుడు ఫోకస్ ఫీచర్లోకి వెళ్లి వర్క్ మోడ్ ఆన్ చేశారనుకోండి.. అప్పుడు దానికి సంబంధించిన ప్రొఫైల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు బ్రౌజర్‌లోకి వెళ్లినా కూడా ఆఫీసుకు సంబంధించిన హిస్టరీ, ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తాయి. మీ పర్సనల్ ఏవీ కనిపించవు.
ఐక్లౌడ్ షేర్డ్ ఫొటో లైబ్రరీ..
స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఒక ఫొటోను ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈజీగా షేర్ చేయొచ్చు. ఇలా షేర్డ్ లైబ్రరీలోకి ఫొటోను పంపేందుకు కెమెరాలోనే ఒక బటన్ ఇస్తున్నారు. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఐదుగురికి ఆ ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. పైగా షేర్డ్ లైబ్రరీపై ఐదుగురికీ ఒకే విధమైన పర్మిషన్స్ ఉంటాయి. ఎవరైనా ఫొటోను యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం చేయొచ్చు.
మెసేజెస్..
మెసేజెస్ను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఐవోఎస్ 16లో కల్పిస్తున్నారు. దీనిద్వారా ఒక వ్యక్తికి పంపించిన మెసేజ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎడిట్ చేయొచ్చు. అంతేకాకుండా ఆ మెసేజ్‌ను రీడై ద్వారా వెనక్కి కూడా తీసుకోవచ్చు. అయితే రీసెంట్ మెసేజ్‌కు మాత్రమే ఇది పనిచేస్తుంది. అలాగే.. అక్కర్లేని మెసేజ్‌లను మార్క్ చేసి అన్‌రీడ్‌గా కూడా చేయొచ్చు.
వీడియోలకు కూడా లైవ్ టెక్ట్స్ ఫీచర్..
ఇకపై వీడియోల్లోని కంటెంట్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇమేజ్‌ల నుంచి టెక్ట్స్‌ను కాపీ చేయడంతో పాటు ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్‌ల్లోని ఫోన్ నంబర్స్‌కి చాలా ఈజీగా కాల్ చేయవచ్చు. వెబ్‌సైట్స్‌ను ఓపెన్ చేయొచ్చు.
డిక్టేషన్ ఫీచర్..
మెయిల్ లేదా మెసేజ్ చేసేటప్పుడు డిక్టేషన్ ఫీచర్ ద్వారా చెప్పే మాటలను టెక్ట్స్ రూపంలోకి మార్చవచ్చు. అదే సమయంలో డిక్టేషన్ ఫీచర్ ఆఫ్ చేయకుండానే కీబోర్డ్ సాయంతో కూడా టైప్ చేసుకోవచ్చు.
యాపిల్ పే లేటర్..
ఐవోఎస్ 16లో యాపిల్ కంపెనీ పే లేటర్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో డబ్బులు లేకపోయినా పేమెంట్ చేయవచ్చు. తిరిగి ఆ మొత్తాన్ని ఆరు వారాల్లో చెల్లించే ఫెసిలిటీ కల్పించనున్నట్టు తెలుస్తోంది.