బీజేపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఉత్తరప్రదేశ్ లో మంత్రులు, ఎమెల్యేలు పార్టీని వీడేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆరుగుతు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. ఈ రోజు మరో ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజుల్లో రాజీనామా చేసిన ఏడో ఎమ్మెల్యేగా వర్మ నిలిచారు. ముఖేశ్ వర్మ ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు, రైతులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని ముఖేష్ వర్మ ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాలనలో దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని.. ఈ వర్గాలను నిర్లక్ష్యం చేశారని, అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను కూడా రాజీనామా చేస్తున్నాను.” అని వర్మ ట్వీట్ చేశారు.