తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు హోరెత్తిస్తుండగా.. పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా చండూరులో ఇవ్వాల (సోమవారం) రాత్రి ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో చేతికి వస్తున్న పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లనే 15 రోజుల క్రితం పడిన వానల వల్ల తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఉన్న కాస్త పంట కూడా చేతికందేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. నాలుగు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.