హైదరాబాద్, ఆంధ్రప్రభ: అభివృద్ధిపైనే తమ దృష్టి అని..రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, మిగతా సమయమంతా రాష్ట్ర అభివృద్ధికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. గచ్చిబౌలీలో జడ్‌ఎఫ్ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అమెజాన్‌లో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే పని చేస్తున్నారని పేర్కొన్నారు. మొబిలిటీ రంగంలో అతిపెద్ద సంస్థ అయినా జడ్‌ఎఫ్.. హైదరాబాద్‌లో తమ సంస్థని ఏర్పాటు చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో ఎనిమిదేళ్లు పూర్తవుతాయని, చిన్న రాష్ట్రం అయినా అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందన్నారు. తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు అన్ని రకాల వాతావరణం ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. హిజాబ్, హలాల్, మతకల్లోలాలు ఇక్కడ లేవన్నారు. ప్రతిభ ఉన్న యువతకు ఇక్కడ అవకాశాలున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ కంపెనీలనే కాకుండా చిన్న, మధ్యతరహా కంపెనీలనూ ఆకర్షిస్తుందని వివరించారు. ఆటోమొబైల్ రంగంలో బాష్, హ్యుందాయ్ తదితర ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగంగా జడ్‌ఎఫ్‌ను ఇక్కడికి ఆహ్వానించామన్నారు. భారతదేశంలో రోడ్స్‌పై ఎవరు ఏ రూట్‌లో వస్తారో తెలియదని, అలాంటి వారికి చెక్ పెట్టే టెక్నాలజీ తేవాలని..అది ఎనిమిదో ప్రపంచ వింత అవ్వుద్దేమోనని మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు. మొబిలిటీ, ఎమర్జింగ్ టెక్నాలజీలు రాబోయే కాలంలో ఉద్యోగాలు కల్పించడంలో, ఆర్థికంగా ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, జడ్‌ఎఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, ఇండియా రీజినల్ హెడ్ కేవీ సురేశ్, సీనియర్ ఉపాధ్యక్షుడు డ్రిక్ అడమ్‌జిక్, ఉపాధ్యక్షుడు కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.