విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పెద్దపెండ్యాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 48 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ అపూర్వ కలయికలో ఒకేవేదికపై కలుసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాడు చదువుచెప్పిన గురువులను పూలదండలు, శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. నాటి పూర్వ హెడ్నాస్టర్, వరదారెడ్డి, ఉపాధ్యాయులు రాధాకిషన్, శాస్త్రి, కుమారస్వామి, సింగారెడ్డి.. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు రాజేందర్, ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
నల్సార్ లా విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ అయిన కృష్ణదేవ రావు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం, వారు కూడా సమావేశానికి హాజరు కావడం ఈ సమ్మేళనానికి శోభనిచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంతా సంతోషంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు ఉపయోగపడతామని తీర్మానాలు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కన పెట్టి వినోద కార్యక్రమాల్లో పాల్గొని గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.