న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భేటీ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. రాహుల్ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో 40 మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమయ్యారు. కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించనున్న సునీల్ రెండు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇచ్చిన కీలక నివేదిక ప్రకారమే ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ నేతల బృందం వేర్వేరుగా రాహుల్‌తో సమావేశమవ్వాలనుకున్నా ఆయన మాత్రం అందరితో ఒకేసారి మాట్లాడతానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికలకు వ్యూహరచన, బీజేపీ-టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం వంటి పలు అంశాలపై రాహుల్ వారికి దిశానిర్దేశం చేశారు. ఐకమత్యమే బలమని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. కలిసి పని చేయాలని, అంతర్గత తగాదాలు వద్దని హితవు పలికారు. ఏమైనా ఉంటే తనతో, కేసి వేణుగోపాల్‌తో మాట్లాడవలసినదిగా రాహుల్ పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే లక్ష్యంగా పని చేయాలని వారిని ఉత్సాహపరిచారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.
కేంద్ర-రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం : రేవంత్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరం రాహుల్ గాంధీని కలిశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు సుదీర్ఘంగా చర్చించామని, ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించారని ఆయన వెల్లడించారు. మతం ముసుగులో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీని తెలంగాణ పొలిమేరల్లోకి రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ వెల్లడించారు. టీఆర్ఎస్-బీజేపీ పార్టీలు తెలంగాణ సమాజాన్ని విభజిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామానికి వెళ్లాలని, నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయబేధాలను పక్కన పెట్టి పని చేయాలని రాహుల్ సూచించారని తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, సోనియా గాంధీ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీని పటిష్టం చేయడమే కాకుండా అధికారంలోకి వస్తామని, కేంద్ర-రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లోకెళ్లి పోరాడతామని రేవంత్ స్పష్టం చేశారు.
ఐక్యమత్యంగా, సంఘటితంగా టీఆర్ఎస్‌పై పోరు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తమలో ఉన్న కొన్ని విభేదాలపై రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని, ఇక నుంచైనా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం దోస్తీ గురించి రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. రాబోయే కాలంలో ఐక్యమత్యంగా, సంఘటితంగా టీఆర్ఎస్ పార్టీపై పోరాడతామని ఉత్తమ్ నొక్కి చెప్పారు.
వీలైనంత ఎక్కువసార్లు తెలంగాణాకు వస్తానన్నారు : భట్టి విక్రమార్క
కలిసికట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. రాష్ట్రానికి రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించామని, వీలైనన్ని ఎక్కువసార్లు వస్తానని హామీ ఇచ్చారని భట్టి సంతోషం వ్యక్తం చేశారు.
సమస్యలు, స్పర్ధలపై నాలుగ్గోడల మధ్యే చర్చ : మధు యాష్కీ
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యమత్యంగా పని చేయాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని మాజీ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. ఈ క్రమంలో ముందుగా ఇంటి సమస్యలు సరిదిద్దుకోవాలని, అంతర్గత విభేదాలు, మనస్పర్థలను అడ్రస్ చేయాలని చెప్పారన్నారు. సమస్యలు, స్పర్ధలు ఏమున్నా సరే నాలుగ్గోడల మధ్యే చర్చ జరగాలి తప్ప బహిర్గతంగా విమర్శించరాదని ఆయన మార్గనిర్దేశం చేశారని వెల్లడించారు. అందుకు అవసరమైన మెకానిజం ఏర్పాటు చేస్తున్నామని రాహుల్ తెలిపినట్టు మధు యాష్కీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ టీఆరెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారన్నారు. అలాగే ఎంఐఎం పార్టీ లౌకిక ఓటు బ్యాంకుకు గండికొడుతూ బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్నాయని, అలాంటి పార్టీతో కూడా పొత్తు ప్రసక్తే లేదని రాహుల్ తేల్చి చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అత్యంత సానుకూల వాతావరణం ఉందని వివరించారు. అనేక సర్వేల్లోనూ ఈ విషయం స్పష్టమైందని, పైగా తెలంగాణలో సానుభూతి కూడా ఉందని రాహుల్ అన్నారని మధుయాష్కీ తెలిపారు. టిఆర్ఎస్, బీజేపీ మధ్య తెర వెనుక పొత్తులున్నాయని, ప్రజలు కూడా గమనిస్తున్నారని, బీజేపీని కావాలనే కేసీఆర్ పైకి లేపుతున్నారని ఆయన విమర్శించారు. అయినా సరే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
వేల పల్లెల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు : దాసోజు శ్రవణ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధిష్టానం భావిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈమధ్యన కాంగ్రెస్ పార్టీలో చేరిన షెఫాలజిస్ట్ సునీల్ సహాయంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా బలాలు, బలహీనతలు, మరింత దృష్టి పెట్టాల్సిన అంశాలు వంటి వాటిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, డేటా సహాయంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి పెద్దగా పట్టించుకోవాల్సిన అంశాలు కాదని, చిన్నచిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నదే అధిష్టానం సూచన అని దాసోజ్ శ్రవణ్ వివరించారు. 6 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ప్రజల అవసరాలను గుర్తిస్తూ మేనిఫెస్టోను సైతం ముందుగానే రూపొందించడం తమ వ్యూహాల్లో భాగమని ఆయన వెల్లడించారు. 12 వేల పల్లెల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరని, కాంగ్రెస్ పార్టీకి ప్రతి పల్లెలోనూ కార్యకర్తలు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి, 19% ఓటు బ్యాంకు ఉన్న బీజేపీతో సీఎం కేసీఆర్ కొట్లాడుతున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. తద్వారా బీజేపీని బలోపేతం చేసి, త్రిముఖ పోటీలో బయటపడాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నాక ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
టికెట్ల పంచాయితీ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాహుల్ గాంధీతో సమావేశంలో టికెట్ల పంచాయితీ తెర మీదికొచ్చినట్టు తెలుస్తోంది. ముందే అభ్యర్థులను ఖరారు చేయడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గానికి విజయ రమణా రావు పేరును ప్రకటించడాన్ని ఆయన లేవనెత్తారు. తాను కూడా అభ్యర్దులను ఖరారు చేయాలా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకున్న మాణిక్యం టాగోర్, టికెట్లు ఖరారు ఏదీ జరగలేదని, అధిష్టానమే ఖరారు చేస్తుందని వెల్లడించినట్టు సమాచారం.