Tuesday, November 19, 2024

త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ… కొత్తగా 27 మందికి ఛాన్స్?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం విస్తరణలో భాగంగా కొత్తగా 27 మందికి చోటు కల్పించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 27 మంది నేతల పేర్లను ఆ పార్టీ అగ్రనాయకత్వం పరిశీలించిందని తెలుస్తోంది. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్​ మోదీ, సర్బానంద్​ సోనోవాల్​, నారాయణ రాణె, భూపేంద్ర యాదవ్​ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి కూడా కేబినెట్‌ చోటు దక్కే అవకాశం ఉంది. ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న శిరోమణి అకాలీదళ్, శివసేనతోపాటు పలు పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయి. కేంద్ర మంత్రి పదవులుకు రాజీనామాలు చేశారు. దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మోదీ మంత్రివర్గ విస్తరణకు మొగ్గు చూపుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ కూలిపోవడానికి కారణమైన ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది. ఆయన గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. బీహార్ మాజీ​ ఉప ముఖ్యమంత్రి సుశీల్​ మోదీని కూడా కేంద్ర కేబినెట్​లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్​కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​, అసోం మాజీ సీఎం సర్బానంద్​ సోనోవాల్​, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తర్ ​ప్రదేశ్​ బీజేపీ అధ్యక్షుడు ​ స్వతంత్ర దేవ్​ సింగ్​, మహారాజ్​గంజ్​ ఎంపీ పంకజ్​ చౌదరి, వరుణ్​ గాంధీ, ఎన్​డీఏ భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్​న.. మంత్రిపదవి వరించే అవకాశం ఉందని సమాచారం. బిహార్​ నుంచి లోక్‌ జనశక్తి నాయకుడు దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్ సోదరుడు పశుపతి పరాస్‌ను కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అంతగా ప్రభావం చూపని కొందరిని తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement