దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండగా.. అబ్బాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. అయితే, తాజాగా అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయస్సు పెంపునకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్న వయసులోనే వివాహంతో గర్భం దాల్చి.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కేంద్రం భావిస్తోంది. దీంతో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006కి సవరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై అమ్మాయిలు, అబ్బాయిల పెళ్లి వయస్సు 21 ఏళ్లుగా ఉండనున్నాయి. దీంతో ఇకపై అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయస్సు సమానం కాబోతోంది.
కాగా, 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… అమ్మాయి పెళ్లి వయసును 21 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజాగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో పెట్టే అవకాశం ఉంది.