Friday, November 22, 2024

కాంగ్రెస్ కు ఊహించని మెజార్టీ.. బీజేపీ, జేడీఎస్ లకు షాక్

కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీ కి మెజార్టీ రాదన్న ఫోల్ సర్వేలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అధికార పీఠానికి అవసరమైన సీట్ల కంటే అధికంగా స్థానాలు సంపాదించడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విధంగా ఏకంగా 136 స్థానాల్లో పాగా వేసింది. గత ఎన్నికల్లో 104 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి అదనంగా మరో 32 స్థానాలను గెలుచుకుంది. సిద్ధరామయ్య, శివకుమార్ ల ధ్వయం, కృషి, రాహుల్ జోడో యాత్ర ప్రభావం, ప్రియాంకగాంధీ ప్రచారం ఈ పార్టీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. అలాగే బీజేపీ 40శాతం అవినీతిని ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లడంలో విజయం సాధించడంతో అధికార పీఠం ఆ పార్టీకి దక్కిందనే వాదనలు వినవస్తున్నాయి. ఇక దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కమల నాధులు కోల్పోయారు. గత ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఆపరేషన్ కమలంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ గూటిలోకి చేర్చుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. అవినీతి పాలనగా పేరు తెచ్చుకున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాని మోడీ 72గంటల పాటు ఏకధాటిగా ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పలేదు. కేంద్రంలో ఉన్న మంత్రులందరూ గత 45 రోజులుగా తిష్టవేసి ఊరూ వాడ ప్రచారం చేసినా కనీసం గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా నిలుపుకోలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరో విశేషం ఏమిటంటే బొమ్మై కేబినెట్ లోని 13మంది మంత్రులు ఓటమి పాలు కావడం.

కింగ్ మేకర్ గా కానీ, కింగ్ గా కానీ అవుదామనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆశలను ఓటర్లు గల్లంతు చేశారు. ఆ పార్టీకి గణనీయంగా పట్టున్న స్థానాల్లో సైతం అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. సాక్షాత్తూ కుమారస్వామే అతికష్టమ్మీద గెలుపు సాధించారు. అతని కుమారుడు నిఖిల్ కూడా చిత్తయ్యాడు. గతంలో 37స్థానాల్లో ఘన విజయం సాధించి కింగ్ మేకర్ గా నిలిచిన కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో ఓటర్లు 19 స్థానాలకే పరిమితం చేశారు.

ఈ ఎన్నికల్లో అతి ఘోరంగా దెబ్బతిన్న పార్టీ గాలి జనార్ధన్ రెడ్డి స్థాపించిన కేఆర్ పీపీ . బళ్లారి సెగ్మెంట్ లోని మొత్తం 15 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ అభ్యర్థుల్లో కేవలం గాలి జనార్ధన్ రెడ్డి ఒక్కరే గంగావతి నుంచి గెలుపొందారు. బళ్లారి రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన భార్య ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా పోటీచేసిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇదిలా ఉంటే బీజేపీ ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి బొమ్మై తన పదవికి రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ఆయన అభినందించారు. అలాగే తమ పార్టీకి ఓటువేసి ఆదరించిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement