Saturday, November 23, 2024

వివాద రహితుడు.. వాదనలో ధిట్ట.. అందరివాడు..

సీనియర్ నేత కొణిజేటి రోశయ్య మరణంతో ఆయన సేవలను కొనియాడుతున్న పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు. తనతో సాన్నిహిత్యంగా మెలిగినవారు.. కలిసి పనిచేసిన వారు.. అతనితో కలిసి నడిచిన వారు.. ఇట్లా చాలామంది రోశయ్య మంచితనాన్ని మెచ్చుకుంటూ కన్నీరుపెడుతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను యాది చేసుకుంటున్నారు..

‘‘ఇక చాలు ఆపవయ్య.. చాల్లేవయ్య.. ముందు నువ్వు కూచొవయ్య.. నీకే మొత్తం తెలుసను కుంటవయ్య.. ఓ.. ఓ.. పెద్ద చెప్పొచ్చావు లేవయ్య!!..’’  ఇలా తన వ్యంగ ధోరణితో.. ప్రతి పక్షాలపై చలోక్తులు విసురుతూ.. అసెంబ్లీని నవ్వుల్లో ముంచేసిన ఘటనలను యాది చేసుకుంటూ కన్నీరుపెడుతున్నారు.

పాత తరం పొలిటీషియన్ గా, ప్రజాప్రతినిధిగా కొణిజేటి రోశయ్య ఎక్కడా నోరు జారిన సూచనలు లేవు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో తన వాదననే ఆయుధంగా చేసుకునేవారు. విషయం పట్ల పూర్తి అవగాహనతో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. ఆ సమయంలో చెన్నారెడ్డికి ఓ వైపు సమరసింహా రెడ్డి, మరో వైపు రోశయ్య అండగా నిలుస్తూ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన తీరు అనన్య సామాన్యమైంది. రాజకీయాలు బూతుల స్థాయికి దిగజారిన ప్రస్తుత తరుణంలో నేటి తరానికి ఆయన వ్యక్తిత్వం ఆదర్శంగా నిలుస్తుంది.

 

కొణిజేటి రోశయ్య 1978 నుంచి వివిధ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. ముఖ్యమంత్రుల మన్ననలను పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా రోశయ్య పనిచేసి తీరు అందరి మన్ననలను అందుకుంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 

- Advertisement -

ఇక బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనాపాటిగా ప్రసిద్ధి పొందారు. ఆయన 16సార్లు శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదించారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థిక మంత్రిగా దేశంలోనే రికార్డు సాధించారు. విషయం పట్ల పూర్తి అవగాహనతో ప్రతిపక్షాల విమర్శలను తన వాక్పటిమతో తిప్పికొట్టేవారు. వ్యంగ్యాస్త్రాలు విసరడంలో కూడా ఆయన పేరెన్నికగన్నారు. ఆయన వాదనాపటిమకు ప్రతిపక్షాలు తలొంచే పరిస్థితి ఉండేది. అయితే, ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించేవారు కారు. 

వివాదాలకు పేరు మోసిన జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. సున్నిత మనస్కుడైన రోశయ్య జయలలిత ధాటికి తట్టుకుంటారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అత్యంత చాతుర్యంతో వ్యవహరిస్తూ జయలలితతో ఏ విధమైన వివాదాలు ఏర్పడకుండా పనిచేశారు. కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి ఎన్డీఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన తమిళనాడు గవర్నర్ గా కొనసాగారు. ఆయన వివాదరహితుడు కావడమే అందుకు కారణం. గవర్నర్ గా ఆయన రాజకీయ తటస్థతతో పనిచేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారు. తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నించారు.  సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన మచ్చలేని రాజకీయ నేతగా నిలిచారు. పలు శాఖలను ఆయన నిర్వహించినప్పటికీ ఆయనకు అవినీతి అంటుకున్న సూచనలు కనిపించవు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానంగా ఆదివారాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో మాత్రం ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు. అప్పట్లో ప్రధాన ప్రసార సాధనం పత్రికా రంగమే. ఆదివారం సంఘటనలు, వార్తలు తక్కువగా ఉంటాయి. దాని వల్ల తన మీడియా సమావేశం ఆదివారం పెట్టుకోవడం వల్ల మంచి కవరేజీ వస్తుందని ఆయన భావించేవారు. రోశయ్య మరణంతో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశం కూడా ఓ నిష్కలంక రాజకీయ నేతను కోల్పోయింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement