మునుగోడు ఇప్పుడు యుద్ధ క్షేత్రం కాబోతోంది. అన్ని పార్టీల ఫోకస్ అంతా అక్కడే ఉండబోతోంది. అయితే.. ఇప్పుడే ఆ నియోజకవర్గ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలే. ఎవరు ఎట్లాంటి వారనే విషయాన్ని గమనించాలే. ఒకప్పుడంటే ప్రజలకు ప్రసార మాధ్యమాలు అందుబాటులో లేకుండేవి. కానీ, ఇప్పుడు నిమిష నిమిషానికి, ప్రతి సెకన్కూ ఏం జరుగుతుందన్న విషయం సోషల్ మీడియాలో సర్య్కులేట్ అవుతోంది. ఇట్లాంటి అద్భుత టెక్నాలజీని ఆసరా చేసుకుని యువత, ప్రజలు మంచి వైపు నిలబడాల్సిన సమయం వచ్చింది. ‘‘అన్బ్రేకబుల్ తెలంగాణ & కేసీఆర్” అనే నినాదాన్ని మునుగోడు ఉప ఎన్నికతో యావత్ దేశానికి సందేశంగా పంపాల్సిన అవసరం ఏర్పడ్డది.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
అవును.. బక్క పలచని మనిషి, పెద్ద గాలివస్తే కొట్టుకుపోయే వ్యక్తి తెలంగాణ తెస్తడని ఎవరూ అనుకోలేదు. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి, ఎన్నో అవమానాలను, హేళనలను భరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేశారు కేసీఆర్. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు తెలంగాణ రూపు రేఖలను సమూలంగా మార్చేశాయి. ఒకప్పుడు తుమ్మలు మొలిచి, బల్లులు కూడా గుడ్లు పెట్టలేని ప్రాంతాలు ఇప్పుడు మూడుకార్ల పంటలతో సస్యశ్యామలంగా మారాయి. దేశంలోనే తెలంగాణ ప్రజల బతుకులు కంప్లీట్‌గా మార్చివేయబడ్డాయి. దీనిక కొన్ని ఎగ్జాంపుల్స్ని పరిశీలిస్తే.. పాలమూరు అంటే ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుండేది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు ఆ జిల్లాను ఇప్పుడు పసిడి పంటల నేలగా మార్చాయనడంలో ఎవరికీ సందేహం లేదు.
ఇక.. నల్లగొండ అంటే వంగిన నడుములు, బోలుపోయిన ఎముకలు, మరుగుజ్జు మనుషులు యాదికి వచ్చేది. అట్లాంటి జిల్లాకు ఫ్లోరైడ్ లేని తాగునీటిని అందించి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇట్లా తెలంగాణలోని ఒక్కో జిల్లాది ఒక్కో సమస్య ఉండగా.. వాటన్నిటీని సమూలంగా ప్రక్షాళన చేసి తెలంగాణను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. తెలంగాణ గురించి కేసీఆర్ అంతకంటే గొప్పగా కలలు గని, అంతకంటే గొప్పగా అభివృద్ధి చేస్తామనే లీడర్లు ఉంటే.. జనాలు తప్పకుండా ఆదరిస్తారు. కానీ, కల్లబొల్లి మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రాంతాలు, కులాలు, మతాల పేరిట అల్లర్లు సృష్టించి తాత్కాలికంగా పబ్బం గడుపుకోవాలనుకునే వారికి మునుగోడు ఎన్నిక అనేది ఓ గుణపాఠం కావాలే. దేశంలో తెలంగాణ బాగుండాలనే కేసీఆర్ కలలను నిజం చేయాలంటే మునుగోడు ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో ఆ నియోజకవర్గంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇవ్వాల (శనివారం) టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీని, కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. ఈడీ పేరుతో పలు రాష్ట్రాల్లో కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. తనపై ఈడీ ప్రయోగిస్తారని కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ‘‘ఈడీ పెట్టుకుంటవో, బోడీ పెట్టుకుంటవో.. ఏం పీక్కుంటవో పీక్కో”అంటే కేసీఆర్ తీవ్రంగానే స్పందించారు.
ఇక.. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్‌ను కీర్తిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని బీజేపీకి చెంపపెట్టులా మారిందనే వాదన వినిపిస్తోంది. ఆ పార్టీకి చాలా సీరియస్ మెస్సేజ్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ‘అన్ బ్రేకబుల్ తెలంగాణ & కేసీఆర్’ అంటూ పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్ లు వెలిశాయి. బుల్‌డోజర్‌లపై కేసీఆర్ పోస్టర్లతో అటు జాతీయంగా, ఇటు తెలంగాణలో కూడా బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ భారీ గేమ్‌ప్లాన్‌లో భాగంగా కనిపిస్తోంది.
అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన పేదలు, అసమ్మతివాదుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలోని మునిసిపాలిటీలో కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇట్లాంటి ఘటనలే జరిగాయి. జహంగీర్‌పురిలో ఇళ్లను బుల్‌డోజర్‌తో కూల్చేశారు. హనుమాన్ జయంతి ఊరేగింపులో రెచ్చగొట్టే విధంగా, హింసాత్మకంగా మారిన తర్వాత ఈ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణతో పాటు యావత్ దేశానికి బీజేపీ తమను ఏం చేయలేదని టీఆర్‌ఎస్ పార్టీ ఓ సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చిందని తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో (దుబ్బాక, హుజూరాబాద్) బీజేపీ గెలిచింది. అయితే.. ఈసారి మునుగోడులో అట్లాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది టీఆర్‌ఎస్ పార్టీ. మునుగోడు ఉప ఎన్నికలో తప్పకుండా విజయం సాధించాలని చూస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. మరో ఏడాదిలో జనరల్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మునుగోడు ఎన్నిక అనేది అన్ని పార్టీలకు కీలకం కానుంది. ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలిస్తే దాని ఇంపాక్ట్ వచ్చే సాధారణ ఎన్నికలపై ఉంటుందన్నది పొలిటికల్ అనలిస్టుల అంచనా. దీంతో అన్ని పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశాలున్నాయి.