తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని, మునుగోడులో బీజేపీ ఓటమి చెందిందనే మోదీ తన అక్కసునంతా వెళ్లగక్కారని అన్నారు. వడ్డీతో సహా ఇస్తారన్న మీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారని జగదీశ్‌రెడ్డి అన్నారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం స్వామీజీలను పంపించి టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు మోసపోవడానికి గుజరాత్ ప్రజల్లాంటి వారు కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారు. నీళ్లు.. పాలను వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారని తెలిపారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామని తేల్చిచెప్పారు.
అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు ప్రధాని ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదలను దోచుకుంటుంన్నది ఎవరనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమయ్యిందని, గ్యాస్ ధర, పెట్రో ధరలను పెంచి పేదల బతుకులను ఆగం చేసిన వారు ఎవరనేది కూడా ప్రజలు గ్రహించరన్నారు. అందుకని రాబోయే ఎన్నికల్లో పేదలను దండుకునే వారి బతుకులు ఆగమవ్వడం ఖాయమని తెలిపారు.