Wednesday, November 20, 2024

ఉమేషా మ‌జాకా.. ఫేస‌ర్ బౌలింగ్ దెబ్బ‌కు పంజాబ్ విల‌విల‌.. 8 వికెట్లు డౌన్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేష్ యాదవ్ బంతితో నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్లోనే పంజాబ్ కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ (1)ను పెవిలియన్ చేర్చిన ఉమేష్.. ఆ తర్వాత కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న లియామ్ లివింగ్‌స్టన్‌ (19)ను కూడా అవుట్ చేసి కోల్‌కతాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ 15వ ఓవర్లో మరోసారి బంతిని అందుకున్న ఉమేష్.. ఆ ఓవర్లో రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను గట్టిగా దెబ్బతీశాడు. ఉమేష్ వేసిన లెంగ్త్ బాల్‌ను హర్‌ప్రీత్ బ్రార్ (14) సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో వికెట్లను కూల్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ చాహర్ (0) తను ఎదుర్కొన్న రెండో బంతికే నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆఫ్‌వికెట్ వైపు వేసిన షార్ట్ బంతిని డిఫెండ్ చేసుకోవడానికి చాహర్ ప్రయత్నించాడు. అయితే అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ రాణా వైపు వెళ్లింది. దాన్ని అతను టక్కున అందుకోవడంతో చాహర్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 137/8 స్కోరుతో నిలిచింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ బ్యాటుకు పనిచెప్పడంతో పంజాబ్ స్కోరు నిలకడగా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement