ఉక్రెయిన్ పై భీకర యుద్ధం చేస్తోంది రష్యా. శక్తిమేరకు ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్. కాగా దేశం కోసం కదనరంగంలోకి దిగాలనుకునే అందరికీ ఆయుధాలను అందిస్తామని దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. అంతేకాదు సైనిక దుస్తులు ధరించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనిచ్చిన పిలుపుతో వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశం కోసం పోరాడేందుకు ముందుకొస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ బాక్సర్లు విటాలీ క్లిట్స్ చ్కో, వ్లాదిమిర్ క్లిట్స్ చ్కో మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొంటామని ప్రకటించారు. వీరిద్దరూ సోదరులు కావడం విశేషం. వీరిలో విటాలీ మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ కావడం విశేషం. విటాలీని అభిమానులు ముద్దుగా ‘ఉక్కు పిడికిలి’ అని పిలుచుకుంటారు. వ్లాదిమిర్ కూడా గొప్ప బాక్సర్ గా హాల్ ఆఫ్ ఫేమ్ లో ఒకరిగా ఉన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 2014 నుంచి విటాలీ మేయర్ గా ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, యుద్ధ రంగంలోకి దిగడం మినహా తనకు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. తన దేశం కోసం యుద్ద రంగంలోకి దిగుతానని 50 ఏళ్ల విటాలీ తెలిపారు. కీవ్ ను రక్షించుకోవడానికి ప్రజలు సైనికుల్లా పోరాడుతారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..