తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెలలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది.. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీజేగా పదోన్నతి లభించింది.
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964, ఆగస్ట్ 2న గువాహటిలో జన్మించారు. గువాహటిలోని డాన్‌బాస్కో స్కూల్‌లో చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఆయన గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా చేరారు.
2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కూడా నియామకమయ్యారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.